Gautam Gambhir: అనారోగ్యంతో మృతిచెందిన పనిమనిషికి అంత్యక్రియలు నిర్వహించిన గౌతం గంభీర్

Gambhir did last rites of his domestic help due to lock down situations
  • గంభీర్ ఇంట్లో ఆరేళ్లుగా పనిచేస్తున్న సరస్వతి
  • అధిక రక్తపోటు, షుగర్ తో ఆసుపత్రిలో చేరిక
  • లాక్ డౌన్ కారణంగా మృతదేహాన్ని స్వస్థలం పంపే వీల్లేని పరిస్థితి
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన పెద్ద మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో మరణించిన తమ పనిమనిషి మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. గంభీర్ ఇంట్లో గత ఆరేళ్లుగా పనిచేస్తున్న సరస్వతి పాత్రా (49) కొంతకాలంగా అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధితో బాధపడుతోంది. కొన్నిరోజుల కిందట ఆమె అస్వస్థతకు లోనవడంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో ఈ నెల 21న ఆమె కన్నుమూసింది.

సరస్వతి పాత్రా స్వరాష్ట్రం ఒడిశా. లాక్ డౌన్ కారణంగా ఆమె మృతదేహాన్ని జయపూర్ జిల్లాలోని స్వస్థలానికి పంపించే వీల్లేకపోవడంతో గౌతమ్ గంభీర్ ఢిల్లీలోనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై గంభీర్ ట్విట్టర్ లో స్పందించారు.

"ఆమెను మేం ఎప్పుడూ పనిమనిషిగా భావించలేదు. మా కుటుంబసభ్యుల్లో ఒకరిగానే పరిగణించేవాళ్లం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించడం నా బాధ్యత. కులం, మతం, సామాజిక హోదా ఏదీ పట్టించుకోలేదు. వ్యక్తిత్వాన్ని గౌరవించాను" అంటూ పేర్కొన్నారు.

కాగా, గంభీర్ పెద్దమనసు చూపడం పట్ల కేంద్ర పెట్రోలియం, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసించారు. 'పనిమనిషి సరస్వతి అనారోగ్యం పాలైనప్పుడు చికిత్స అందించడం నుంచి ఆమె మృతదేహానికి అంతిమ సంస్కారాలు నిర్వహించడం వరకు గంభీర్ మానవీయతకు నిదర్శనంలా నిలిచారు' అంటూ కొనియాడారు.
Gautam Gambhir
Domestic Help
Saraswati Patra
Death
Last Rites
Odisha

More Telugu News