Brahmanandam: జీవితాన్ని అలా తీసుకుంటే తప్ప నెట్టుకురాలేం: హాస్యనటుడు బ్రహ్మానందం
- ‘కరోనా’ కేసులు పెరుగుతున్నాయంటే భయమేస్తోంది
- కానీ, భయపడకూడదు..‘లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్’
- సమస్యలు వచ్చినప్పుడు పోరాడాలే తప్ప వెనుదిరగొద్దు
‘కరోనా’ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయంటే ఒక రకంగా భయమేస్తోంది కానీ, భయపడకూడదని, ‘లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్’ అని దానిని ఎదుర్కోవాలని, జీవితాన్ని అలా తీసుకుంటే తప్ప మనం నెట్టుకురాలేమని ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం అభిప్రాయపడ్డారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చేమో కానీ, కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేం’ అంటే ఎంతటి వాడికైనా ఒడిదుడుకులు, కష్టసుఖాలు, బాధలు, సమస్యలు తప్పవని అన్నారు. మనిషి రక్తమాంసాలతో నిండి ఉన్నాడని మనం అనుకుంటాం కానీ సమస్యలతో నిండి ఉన్నాడన్న వివేకానందుడి సూక్తిని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
సమస్యలు వచ్చినప్పుడు పోరాడాలే తప్ప వెనుదిరగకూడదని, ‘కరోనా’నే కాదు అంతకంటే భయంకరమైనది ఏదొచ్చినా సరే, నిలబడగలిగే శక్తిని ఎవరికి వారు పొందాలని, దేవుడిని నమ్మేవాళ్లు ప్రార్థించడం ద్వారా దైర్యం పొందాలని సూచించారు. లాక్ డౌన్ అనేది చాలా విచిత్రమైన పరిస్థితి అని, ఇలాంటి సమయంలో ‘ఓర్పు’, ‘సహనం’ చాలా అవసరమని సూచించారు.