Saqlain Mustaq: సచిన్ ఆ మాట అనడంతో నా జీవితంలో స్లెడ్జింగ్ చేయలేకపోయాను: సక్లాయిన్ ముస్తాక్
- ఇవాళ సచిన్ జన్మదినం
- ఫోన్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన పాక్ మాజీ స్పిన్నర్
- 1997 నాటి విషయాలను గుర్తుచేసుకున్న సక్లాయిన్
క్రికెట్ చరిత్రలో ఆటతోనే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ కాంతులీనిన అతి కొద్దిమందిలో సచిన్ టెండూల్కర్ ఒకడు. మైదానంలో జెంటిల్మన్ అంటే సచిన్ పేరే చెప్పుకోవాలి అనేలా తన వ్యవహార సరళితో గుర్తింపు తెచ్చుకున్నాడు. బౌలర్లు తనపై స్లెడ్జింగ్ కు దిగినా ఎక్కడా మాట జారకుండా తన బ్యాట్ తోనే సమాధానం చెప్పడం సచిన్ కే చెల్లింది. ఇవాళ సచిన్ జన్మదినం సందర్భంగా పాక్ మాజీ స్పిన్నర్ సక్లాయిన్ ముస్తాక్ ఆసక్తికర విషయం వెల్లడించాడు.
ఓసారి సచిన్ పై స్లెడ్జింగ్ చేసే ప్రయత్నం చేసి దెబ్బతిన్నానని సక్లాయిన్ ఫోన్ ద్వారా భారత మీడియా సంస్థకు వివరించాడు. "1997లో భారత్, పాక్ మధ్య కెనడాలో సిరీస్ జరిగింది. అప్పటికి నేను జట్టులో కొత్తవాడిని. సచిన్ ను స్లెడ్జింగ్ చేయడం అదే మొదటిసారి. కానీ సచిన్ ఎంతో ప్రశాంతంగా నా వద్దకు వచ్చి "నేనెప్పుడూ నీతో చెడుగా ప్రవర్తించలేదు, నువ్వెందుకు నాతో చెడుగా ప్రవర్తిస్తున్నావు?" అని అడిగాడు.
దాంతో ఏం సమాధానం చెప్పాలో నాకు తోచలేదు. సచిన్ అలా మాట్లాడతాడని ఊహించని నేను ఎంతో ఇబ్బందిపడ్డాను. అంతేకాదు, "ఓ వ్యక్తిగా, ఆటగాడిగా నిన్ను ఎంతో ఉన్నతంగా భావిస్తున్నాను" అని కూడా సచిన్ అన్నాడు. దాంతో నా స్లెడ్జింగ్ కు అదే ఆఖరు. అప్పుడే కాదు, సచిన్ ను ఇంకెప్పుడూ స్లెడ్జింగ్ చేయలేదు. నా బౌలింగ్ లో బౌండరీలు బాదుతున్నా నోరు జారలేదు. ఆ మ్యాచ్ తర్వాత సచిన్ కు క్షమాపణలు చెప్పాను కూడా. నేను కలిసిన వారిలో ఎంతో వినయశీలి అంటే సచిన్ పేరే చెప్పాలి" అంటూ సక్లాయిన్ నాటి విషయాలను గుర్తుచేసుకున్నారు.