Chiranjeevi: ‘రక్షించే పోలీసులను.. ’ అంటూ చంద్రబోస్ రాసిన పాటకు చిరంజీవి ప్రశంసలు!
- ‘కరోనా’ కష్టకాలంలో పోలీసుల విధి నిర్వహణలపై పాట
- సైబరాబాద్ సీపీ సూచన మేరకు పాట రాసిన చంద్రబోస్
- ఆ పాట ఆలోచన రేకెత్తించేలా ఉందంటూ చిరంజీవి ప్రశంస
‘కరోనా’ బారిన పడకుండా ప్రజలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న పోలీసులను గౌరవిద్దాం, వారికి సహకరిద్దామంటూ ప్రముఖ హీరో చిరంజీవి పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ రాసి, స్వయంగా పాడిన పాట వీడియోను చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రజల్లో ఆలోచన రేకెత్తించేలా ఈ పాట ఉందంటూ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్, సైబరాబాద్ పోలీస్ ను ట్యాగ్ చేశారు.
సీపీ సజ్జనార్ పాట రాయమన్నారు.. బాధ్యతతో రాశాను: చంద్రబోస్
‘కరోనా’ కష్టకాలంలో పోలీసుల విధి నిర్వహణ చాలా గొప్పగా ఉందని, చాలా మంది ప్రజలు వారికి సహకరిస్తున్నారని, మరికొంత మంది అడ్డుతగులుతున్నారని, ఈ అంశంపై పాట రాయమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అడిగారని, ‘బాధ్యతతో ఆ పాట రాశానని పాటల రచయిత చంద్రబోస్ పేర్కొన్నారు. ‘ఆలోచించండి అన్నలారా, ఆవేశం మానుకోండి తమ్ముల్లారా..’ అంటూ తాను రాసిన పాటను ఆయన స్వయంగా పాడి వినిపించారు.