Anand Mahindra: ఆటో రిక్షాలో భౌతికదూరం ఏర్పాట్లు చూసి అచ్చెరువొందిన ఆనంద్ మహీంద్రా
- కరోనా నివారణలో కీలకంగా మారుతున్న భౌతిక దూరం
- ఆటో లోపలి భాగాన్ని అనేక విభాగాలుగా విభజించిన డ్రైవర్
- వీడియో ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా
కరోనా వైరస్ నివారణలో భౌతిక దూరం పాటించడం సత్ఫలితాలను ఇస్తుందన్నది ప్రభుత్వాల నుంచి వైద్య నిపుణుల వరకు అందరూ ముక్తకంఠంతో చెబుతున్న మాట. అందుకే ఈ ఆటో రిక్షా డ్రైవర్ తన ఆటోలో ఎక్కేవారి క్షేమం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన ఆటో లోపలి భాగాన్ని అనేక భాగాలు విభజించి, ఒక భాగానికి మరో భాగానికి మధ్య అడ్డుగోడలు ఏర్పాటు చేశాడు. మొత్తమ్మీద నలుగురు వ్యక్తులు భౌతిక దూరం పాటిస్తూ ఆటోలో ప్రయాణించేలా తన ఆటోను తీర్చిదిద్దాడు.
దీనికి సంబంధించిన వీడియో చూసిన వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా అచ్చెరువొందారు. మన ప్రజల తెలివితేటలు, ఆవిష్కరణ శక్తులు త్వరితగతిన అభివృద్ధి చెందుతున్నాయని ట్వీట్ చేశారు. నా అభిప్రాయం ఏంటంటే, ఈ ఆటో రిక్షా డ్రైవర్ ను మన ఆర్ అండ్ డి మరియు ప్రొడక్ట్ డెవలప్ మెంట్ టీమ్ లకు సలహాదారుగా నియమించాలి అని అభిప్రాయపడ్డారు.