Corona Virus: యూపీలో దారుణం.. చికిత్స కోసం ఫుట్ పాత్ పై పడిగాపులు కాసిన 69 మంది కరోనా పేషెంట్స్!

69 Corona Patients Wait On Footpath Outside UP Hospital For Admission

  • ఉత్తరప్రదేశ్ లోని ఆసుపత్రి వద్ద దారుణ ఘటన
  • ఆగ్రా నుంచి తరలించిన బాధితులను పట్టించుకోని సిబ్బంది
  • సమాచార లోపం వల్లే అని చెప్పిన అధికారి

దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్నప్పటికీ పలు చోట్ల సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విమర్శలకు ఊతమిచ్చే మరో దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ ఎట్టావా జిల్లాలోని సాయ్ ఫాయ్ లో చోటు చేసుకుంది. వైద్యులు, మెడికల్ స్టాఫ్ తమను అడ్మిట్ చేసుకోకపోవడంతో ఏకంగా 69 మంది కరోనా వైరస్ పేషెంట్లు ఉత్తరప్రదేశ్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి గేట్ల వద్ద పడిగాపులు కాశారు. ఆసుపత్రి వెలుపల ఉన్న ఫుట్ పాత్ పై కనీసం ఒక గంట పాటు వేచి చూశారు.

కరోనా సోకిన నేపథ్యంలో వీరందరినీ ఆగ్రా నుంచి సాయ్ ఫాయ్ కి తరలించారు. ఓ బస్సులో వీరందరినీ ఒక ఎస్కార్ట్ టీమ్ తో పాటు పంపించారు. అయితే, ఇక్కడకు వచ్చిన తర్వాత వీరిని ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఫుట్ పాత్ పై వీరున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కేవలం మొహానికి మాస్క్ మాత్రమే వీరు ధరించారు. రక్షిత కిట్స్ ధరించిన ఇద్దరు పోలీసులు కొంచెం దూరం నుంచి వీరిని నియంత్రిస్తున్నట్టు వీడియోల్లో ఉన్నాయి.

ఈ విషయం తెలుసుకున్న స్థానిక  పోలీస్ ఇన్చార్జి వెంటనే అక్కడకు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. మీరు వస్తున్నట్టు సమాచారం లేకపోవడం వల్లే... ఏర్పాట్లను చేయలేకపోయారని, జరిగిందేదో జరిగిపోయిందని అన్నారు. కదలకుండా ఇక్కడే ఉండాలని, ఇక్కడి నుంచి కదిలితే ఇతరులకు కరోనా సోకే ప్రమాదం ఉందని చెప్పారు.

ఈ ఘటనపై ఆసుపత్రికి అనుసంధానంగా ఉన్న యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీసీ మాట్లాడుతూ, సమాచార లోపం వల్లే ఇది జరిగిందని అన్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం లేదని చెప్పారు. సరైన డాక్యుమెంట్లు లేనప్పటికీ అందరినీ అడ్మిట్ చేసుకున్నామని, అయితే ఒక గంట ఆలస్యం జరిగిందని అన్నారు.

  • Loading...

More Telugu News