Rahul Gandhi: గుజరాత్ లో నెల రోజులుగా 6 వేల మంది ఏపీ మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: రాహుల్ గాంధీ ఆందోళన
- లాక్ డౌన్ తో గుజరాత్‌లోనే చిక్కుకుపోయారు
- చిన్నపాటి పడవల్లోనే ఉంటున్నారు
- సరిగ్గా తిండి, నీళ్లు కూడా దొరకట్లేదు
- అనారోగ్యానికి గురవుతున్నారు
గుజరాత్‌లోని వీరావల్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మత్స్యకారులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. లాక్డౌన్ నేపథ్యంలో వారు అక్కడ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తీవ్ర అనారోగ్యం పాలై కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్లకు తినేందుకు తిండి కూడా దొరకట్లేదని తెలుస్తోంది. వైద్య సదుపాయం కూడా అందకుండా పోతుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఓ జాతీయ మీడియాలో వచ్చిన వార్తను ఆయన పోస్ట్ చేశారు.
దాదాపు 6,000 మంది ఏపీకి చెందిన మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకుపోయారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నెల రోజులుగా వారు తమ చిన్నపాటి పడవల్లోనే ఉంటూ సరిగ్గా తిండి, నీళ్లు కూడా లేక అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారందరినీ వసతి గృహాల్లోకి తరలించాలని, వారికి సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు. కాగా, తామందరం చనిపోతామనే భయంతో బతుకుతున్నామని అక్కడి మత్స్యకారులు మీడియాకు తెలిపారు.