Harbin: చైనాలో మరో వూహాన్.. వణికిస్తున్న హర్బిన్!
- చైనా ఈశాన్య నగరాల్లో విస్తరిస్తున్న కరోనా
- హర్బిన్ నగరంలో డజన్ల కొద్దీ కేసులు
- పూర్తిగా స్తంభించిపోయిన హర్బిన్
కరోనా వైరస్ కు కేంద్ర స్థానమైన చైనాలోని వూహాన్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మొన్నటి వరకు వూహాన్ నగరాన్ని కరోనా ఊపేసింది. వూహాన్ కోలుకోవడంతో ఊపిరి పీల్చుకున్న చైనాకు... మరో వూహాన్ ఎదురైంది. ఈశాన్య నగరం హర్బిన్ ఇప్పుడు చైనాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మొన్నటి వరకు వూహాన్ పై పంజా విసిరిన కరోనా... ఇప్పుడు హర్బిన్ ను టార్గెట్ చేసింది. కోటి వరకు జనాభా కలిగిన హర్బిన్ లో డజన్ల కొద్దీ కరోనా కేసులు బయటపడుతున్నాయి. దీంతో, హర్బిన్ తో పాటు ఈశాన్యంలోని పలు నగరాల్లో వారం క్రితం నుంచి కట్టుదిట్టమైన ఆంక్షలను అమలు చేస్తున్నారు.
అమెరికా, రష్యాల్లో ఉన్న చైనీయులు ఒక్కసారిగా తిరిగి రావడమే కేసులు పెరగడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. న్యూయార్క్ నుంచి వచ్చిన ఓ విద్యార్థి నుంచి 70 మందికి వైరస్ సోకినట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో హర్బిన్ నగరాన్ని షట్ డౌన్ చేశారు. ప్రజా రవాణాతో పాటు అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి. వూహాన్ లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని చైనా ప్రభుత్వం ప్రకటించిన గంటల వ్యవధిలోనే... హర్బిన్ లో కరోనా విస్తరిస్తుండటంతో ఆందోళనలు ఎక్కువవుతున్నాయి.