AC: కరోనా నేపథ్యంలో.. ఏసీలు, కూలర్ల వాడకంపై కేంద్రం మార్గదర్శకాలు ఇవిగో!

Government releases guidelines for usage of ac and coolers

  • ఏసీల వాడకంతో కరోనా వ్యాపిస్తుందంటూ ప్రచారం
  • ఏసీలను 24 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉంచాలని  సూచన
  • తేమ శాతం 40 నుంచి 70 మధ్య ఉంటే మేలన్న నిపుణులు

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం మరింత పెరగనుంది. అయితే కరోనా వైరస్ ఏసీలు, కూలర్ల కారణంగా మరింత వ్యాప్తి చెందుతుందని ప్రచారం జరుగుతుండడంపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

సొసైటీ ఆఫ్ హీటింగ్, రిఫ్రిజిరేటింగ్ అండ్ ఎయిర్ కండిషనర్ ఇంజినీర్స్ రూపొందించిన ఈ మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం, ఇళ్లలో ఏసీల వాడకంలో గది ఉష్ణోగ్రతను 24 నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉండేలా చూసుకోవాలని, సంబంధిత తేమ శాతం 40 నుంచి 70 మధ్య ఉంటే మేలని సూచించింది. వ్యాధికారక క్రిముల వ్యాప్తి నివారణకు ఇవి సరైన ఉష్ణోగ్రతలని వివరించింది.

ఎయిర్ కండిషనర్లు
  • తేమ వాతావరణంలో ఏసీని 24 డిగ్రీల సెంటిగ్రేడ్ కు దగ్గరగా సెట్ చేయాలి. పొడి వాతావరణంలో 30 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండేలా జాగ్రత్త పడాలి. గది నలుమూలలకు గాలి ప్రసరించేందుకు ఫ్యాన్లు వాడొచ్చు.
  • పొడి వాతావరణం నెలకొని ఉంటే సంబంధిత తేమ శాతాన్ని 40 శాతం కంటే తక్కువ ఉంచరాదు.
  • ఏసీలు ఆన్ లో ఉన్నప్పుడు రూమ్ కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచాలి. ఏసీ గాలి అక్కడే పరిభ్రమించకుండా, సహజసిద్ధమైన రీతిలో శుభ్రపడుతుంది.
  • ఏసీలు వాడుతున్నప్పుడు బయటి నుంచి వచ్చేగాలి ఫ్రెష్ గా ఉండాలంటే కిచెన్, టాయిలెట్లలో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి. తద్వారా బయటి నుంచి దుమ్ము, ధూళితో కూడిన గాలిని నిరోధించవచ్చు.
కూలర్లు
  • పరిశుభ్రమైన గాలి ప్రసరించాలంటే ఎవాపరేటివ్ కూలర్లు గాలిని బయటి నుంచి స్వీకరించేలా ఉండాలి.
  • ఎవాపరేటివ్ కూలర్లలో నీటి ట్యాంకులను శుభ్రపరచాలి. క్రిమినాశని రసాయనాలతో శుద్ధి చేయాలి. ఒకసారి వాడిన నీటిని తొలగించేందుకు తగిన ఏర్పాట్లు ఉండాలి.
  • కూలర్ల నుంచి వచ్చే తేమతో కూడిన గాలిని బయటికి పంపేందుకు కిటికీలు తెరిచే ఉంచాలి. పోర్టబుల్ ఎవాపరేటివ్ కూలర్లు బయటి నుంచి గాలిని స్వీకరించే ఏర్పాట్లు కలిగి వుండవు కనుక, ఆ తరహా కూలర్ల వాడకం నిలిపివేయాలి.
ఫ్యాన్లు 
  • ఫ్యాన్లు తిరిగే సమయంలో గది కిటికీలు పాక్షికంగా తెరిచి ఉంచాలి.
  • సాధారణ ఫ్యాన్లు తిరిగే సమయంలో ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఆన్ లో ఉంటే మరీ మంచిది. మెరుగైన రీతిలో గదిలోని గాలి ఎప్పటికప్పుడు శుభ్రపడే అవకాశం ఉంటుంది.

  • Loading...

More Telugu News