Raj Thackeray: వైన్ షాపులు తెరవాలన్న రాజ్ థాకరేకు శివసేన కౌంటర్!
- వైన్ షాపులు తెరిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్న రాజ్ థాకరే
- వైన్ షాపులు తెరిచినంత మాత్రాన ఆదాయం రాదన్న శివసేన
- లిక్కర్ ఫ్యాక్టరీలు తెరిస్తేనే ఆదాయం వస్తుందని వ్యాఖ్య
లాక్ డౌన్ తో మహారాష్ట్ర ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని కోల్పోయిందని... ఆదాయాన్ని పెంచుకునేందుకు వైన్ షాపులను తిరిగి తెరవాలని ప్రభుత్వానికి ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాకరే సూచించారు. వైన్ షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీని వల్ల ఆల్కహాల్ తీసుకునే వారి ఇబ్బందులు తీరడమే కాక, ఈ సంక్షోభ సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ మేరకు గత గురువారం ముఖ్యమంత్రి కార్యాలయానికి రాజ్ థాకరే లేఖ రాశారు. ఈ సూచనలపై శివసేన కౌంటర్ ఇచ్చింది.
రాష్ట్ర ఆదాయంపై రాజ్ థాకరేకు నిజంగానే అంత ఆందోళన ఉందా? అని శివసేన అధికారిక పత్రిక సామ్నా ప్రశ్నించింది. లాక్ డౌన్ కారణంగా వైన్ షాపులే కాకుండా, లిక్కర్ తయారు చేసే ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయనే విషయాన్ని తెలుసుకోవాలని ఎద్దేవా చేసింది. వైన్ షాపులు తెరిచినంత మాత్రాన ఆదాయం రాదని... ఫ్యాక్టరీల నుంచి డిస్ట్రిబ్యూటర్లు లిక్కర్ ను కొనుగోలు చేసినప్పుడే ప్రభుత్వానికి సేల్స్, ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుందని తెలిపింది. ఫ్యాక్టరీలు తెరవాలంటే కార్మికులు అవసరమని చెప్పింది. వైన్ షాపులు తెరిస్తే జనాలు సామాజిక దూరాన్ని పాటించరని, దీని వల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయని తెలిపింది.