Arvind Kejriwal: దేశంలో కరోనా వ్యాప్తి తగ్గకముందే సడలింపులు ఎందుకు?: కేజ్రీవాల్
- లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు సరికాదు
- ఢిల్లీలో దుకాణాలు తెరిచేందుకు అనుమతివ్వం
- ఇప్పటిదాకా ఉన్న నిబంధనలే అమలవుతాయి
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన లాక్‌డౌన్ సడలింపులపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకముందే సడలింపులు ఇవ్వడం సరైన నిర్ణయం కాదన్నారు. ఢిల్లీ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ తాజా మార్గనిర్దేశకాలను ఢిల్లీలో అమలు చేయబోమని స్పష్టం చేశారు.
ప్రస్తుతం కొనసాగుతున్న నిబంధనలే అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగిస్తామని చెప్పారు. ఢిల్లీలో దుకాణాలను తెరచే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ఈ నెల 27న ప్రధానమంత్రితో జరిగే వీడియో సమావేశం తర్వాత ఆంక్షల సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ చెప్పారు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే ఆంక్షలపై సడలింపులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఢిల్లీలో ఇప్పటిదాకా 2,514 మందికి వైరస్ సోకింది.