Pasha Brothers: కర్ణాటకలో అపూర్వ సహోదరులు... లాక్ డౌన్ లో పేదలకు అన్నం పెట్టడానికి భూమిని అమ్మేశారు!
- రూ.25 లక్షలకు భూమి విక్రయం
- 3 వేల మంది పేదలకు సాయం
- ఆహారంతో పాటు మాస్కులు, శానిటైజర్లు అందజేత
లాక్ డౌన్ నేపథ్యంలో పేదల వెతలు వర్ణనాతీతం. కర్ణాటకలోని ప్రసిద్ధ కోలార్ ప్రాంతం కూడా కరోనా ధాటికి స్తంభించిపోయింది. దాంతో అక్కడి కార్మికులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే కోలార్ పేదల దుస్థితిని గమనించిన తాజమ్ముల్ పాషా, ముజామ్మిల్ పాషా అనే ఇద్దరు సోదరులు తమ భూమిని రూ.25 లక్షలకు అమ్మేసి, ఆ డబ్బుతో పేదలకు సాయం చేసేందుకు ఉపక్రమించారు.
పెద్ద సంఖ్యలో ఉన్న పేదలకు నిత్యావసరాలు, ఆహార ధాన్యాలు అందిస్తున్నారు. నూనెలు, తృణధాన్యాలు కూడా కొనుగోలు చేసి వాటిని పేదలకు పంపిణీ చేశారు. తమ ఇంటికి సమీపంలోనే టెంట్ వేసి భారీ స్థాయిలో వంటశాల ఏర్పాటు చేశారు. కార్మికులకు, నిరాశ్రయులకు అక్కడ వండిన ఆహారం సరఫరా చేస్తున్నారు.
దీనిపై తాజుమ్ముల్ పాషా మాట్లాడుతూ, తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో కోలార్ లోని అమ్మమ్మ ఇంటి వద్ద పెరిగామని, కోలార్ లో హిందువులు, సిక్కులు, ముస్లింలు అందరూ తమకు ఎంతో ఉదారంగా సహకరించారని, మతాన్ని ఎవరూ పట్టించుకోలేదని వెల్లడించారు.
కోలార్ కు చెందిన ఈ పాషా బ్రదర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు అరటి పంట సాగు చేస్తుంటారు. లాక్ డౌన్ నేపథ్యంలో వేలమంది కష్టాల్లో చిక్కుకోవడంతో తమ భూమిని అమ్మేశారు. ఇప్పటివరకు 3000 కుటుంబాలను ఈ సోదరులు ఆదుకున్నారు. పేదవాళ్లకు అన్నసదుపాయాలు కల్పించడమే కాదు శానిటైజర్లు, మాస్కులు కూడా అందిస్తున్నారు.