Narendra Modi: నేటి మన ఐకమత్యాన్ని భావి తరాలు కథలుగా చెప్పుకుంటాయి: ప్రధాని నరేంద్ర మోదీ!
- నేటి తరం ప్రజల పోరాటం భావి తరాలకు స్ఫూర్తి
- రంజాన్ పండగ నాటికి కరోనాను తరిమేశామన్న శుభవార్త
- ప్రపంచ దేశాల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించాం
- బయటకు వెళ్లే సమయంలో మాస్క్ లు తప్పనిసరి
- 64వ 'మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ
కరోనా వైరస్ మహమ్మారి కట్టడికి భారతీయులంతా కలిసి చేస్తున్న ఈ పోరాటాన్ని భావి తరాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన 64వ 'మన్ కీ బాత్'లో భాగంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ప్రజల సహకారం లేనిదే కరోనాను ఎదుర్కోవడంలో ఎవరూ విజయం సాధించలేరని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకుని, తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలే ముందుండి యుద్ధం చేస్తున్నారని, ఈ స్ఫూర్తి కొనసాగాలని కోరారు.
"అది నగరమైనా, గ్రామమైనా, ప్రతి ప్రాంతంలోని ప్రతి ఒక్కరూ ఈ యుద్ధంలో భాగస్వాములయ్యారు. ఎంతో మంది పేదలకు నిత్యమూ సాయపడుతూ ఉన్నారు. మరికొందరు తమ తమ పొలాలను విక్రయించి మరీ, ఈ యుద్ధానికి అవసరమైన నిధులను సేకరిస్తున్నారు. ఎంతో మంది తమకు నెలవారీ అందే పింఛన్లను సహాయ నిధులకు అందిస్తున్నారు. వారి రుణాన్ని ఏ విధంగానూ తీర్చుకోలేము" అని వ్యాఖ్యానించారు.
కరోనా నివారణకు, బాధితుడి శరీరంలోని వైరస్ ను తరిమి కొట్టేందుకు అవసరమైన ఔషధాలను ఎన్నో దేశాలకు అందించామని, ఇది భారత్ మాత్రమే సాధించిన ఘనతని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల పట్ల భారత్ మానవతా దృక్పథాన్ని ప్రదర్శించిందన్నారు. రోజువారీ ఆదాయంతో పూట గడిపే ఎంతో మంది పరిస్థితి దయనీయంగా మారిందన్న సంగతి తనకు తెలుసునని, వైరస్ కారణంగా ఉపాధిని కోల్పోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని మోదీ హామీ ఇచ్చారు.
పౌర సమాజానికి సరికొత్త సంకేతంగా మాస్క్ లు అవతరించాయని, అంతమాత్రాన ప్రతి ఒక్కరూ మాస్క్ లను ధరించాలని తాను చెప్పడం లేదని, బయటకు వెళ్లేవారు, జలుబు, దగ్గు ఉన్నవారు తప్పనిసరిగా మాస్క్ లను వాడాలని, తద్వారా శరీరంలోని క్రిములు బయటకు వెళ్లబోవని, బయట తిరిగే వారికి క్రిములు సోకవని అన్నారు. కరోనా కట్టడి విషయంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ సమర్థవంతంగా పోరాడుతున్నాయని కితాబిచ్చిన మోదీ, ప్రజల్లో సైతం మార్పు వచ్చిందని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు.
పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా, సామాజిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించిన మోదీ, మైనారిటీ సమాజం ఈ నెల రోజులనూ గడిపేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు కృషి చేస్తాయని, రంజాన్ పండగకు ముందే ప్రజలు ఓ శుభవార్తను వింటారని, అది కరోనా అంతరించిందన్న విషయమే అవుతుందన్న నమ్మకం తనకుందని వ్యాఖ్యానించారు.