bihar: పోలీసుతో గుంజీలు తీయించిన అధికారికి ప్రమోషన్
- బిహార్‌లో ఘటన
- పోలీసుతో గుంజీలు తీయించిన వీడియో ఇటీవల వైరల్
- వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రమోషన్
- మండిపడ్డ ప్రతిపక్ష పార్టీలు
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్న ఓ పోలీసుతో ఇటీవల గుంజీలు తీయించాడో అధికారి. ఆయనకు తాజాగా ప్రమోషన్ రావడం చర్చనీయాంశంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే బీహార్‌లోని అరారియా జిల్లాలోని బైర్‌గాచి చౌక్ నుంచి వ్యవసాయ అధికారి (డీఏవో) మనోజ్ కుమార్ కారులో ఏప్రిల్ 20న వెళ్తుండగా అక్కడ విధుల్లో ఉన్న పోలీసు గణేశ్ ఆయన కారును ఆపాడు. దీంతో డీఏవోకు కోపం వచ్చింది. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆపాడని, గణేశ్‌ను జైల్లో పెట్టిస్తానని బెదిరించాడు.
తన కారును ఆపినందుకు రెండు చెవులూ పట్టుకుని గుంజీలు తీయించాడు. క్షమాపణలు చెప్పాలని అడిగి, చెప్పించుకుని మరీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ అయింది. అక్కడున్న పోలీసులు కూడా డీఏవోకే మద్దతు పలకడం గమనార్హం.
పోలీసుతో గుంజీలు తీయించిన అతడు ఇప్పుడు పట్నాకు ట్రాన్స్ఫర్ అయ్యాడు.. వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ప్రమోషన్ పొందాడు. అయితే, పోలీసుతో గుంజీలు తీయించిన అంశంపై మాత్రం ఆయనపై విచారణ జరుగుతూ ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఆయనపై ఓ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఆ అధికారికి ప్రమోషన్ ఇవ్వడంపై బిహార్ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.