Madhya Pradesh: ఓ హై ఎండ్ కారులో వెళ్తున్న కుర్రాడిని ఆపి.. అతనితో గుంజీలు తీయించిన సెక్యూరిటీ !
- మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఘటన
- లాక్ డౌన్ సమయంలో ఎందుకు వచ్చావు? అని ప్రశ్నించిన సిబ్బంది
- కర్ఫ్యూ పాస్ ఉన్న సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపణ
హై ఎండ్ కారు పార్షే ను డ్రైవ్ చేస్తూ వెళ్తున్న ఓ యువకుడిని సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు ఆపి అతనితో గుంజీలు తీయించారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో జరిగింది. ఎల్లోకలర్ టూ సీటర్ కారు నడుపుకుంటూ వెళ్తున్న ఇరవై ఏళ్ల కుర్రాడిని ఇండోర్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ లోని సిబ్బంది ఒకరు ఆపారు. ఆర్మీ, పారా మిలిటరీ, పోలీసులుగా చేసి రిటైర్డ్ అయిన వారితో సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఇండోర్ లోని పోలీస్ స్టేషన్లకు వీటిని అనుసంధానించారు.
లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో రోడ్డుపైకి ఎందుకు వచ్చారని ఆ యువకుడిని ప్రశ్నించారు. కారులో నుంచి కిందకు దిగిన ఆ యువకుడు, తన వాహనానికి సంబంధించిన పేపర్లు వారికి చూపించి మాట్లాడాడు. అతని సమాధానానికి సంతృప్తి చెందని సిబ్బంది ఒకరు తన చేతిలో లాఠీ చూపిస్తూ గుంజీలు తీయమని ఆదేశించాడు. రెండు చేతులతో తన చెవులు పట్టుకున్న ఆ యువకుడు గుంజీలు తీయక తప్పలేదు. అనంతరం, కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కాగా, ఆ యువకుడి తండ్రి పేరు డర్యాని. ఇండోర్ లోని ఆషా కన్ఫెక్షనరీ యజమాని. ఆ యువకుడితో సెక్యూరిటీ కౌన్సిల్ సిబ్బంది గుంజీలు తీయించడంపై అతని కుటుంబసభ్యులు మండిపడ్డారు. అతని వద్ద కర్ఫ్యూ పాస్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పటికీ సిబ్బంది దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ ఘటన నేపథ్యంలో యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.