Tablighi Jamaat: కోలుకున్న తబ్లిగీల ప్లాస్మాతో కరోనా రోగులకు చికిత్స
- తబ్లిగీల కారణంగానే కరోనా వ్యాపించిందంటూ ఆరోపణలు
- ప్లాస్మా దానం చేసేందుకు మందుకు వస్తున్న తబ్లిగీలు
- దాతల కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ సర్కారు
ఇటీవల లాక్ డౌన్ కు ముందు ఢిల్లీలో నిర్వహించిన మతపరమైన సమావేశంలో వందల మంది తబ్లిగీలు పాల్గొనగా, వారిలో అత్యధికులకు కరోనా నిర్ధారణ అయింది. తబ్లిగీల కారణంగానే దేశవ్యాప్తంగా కరోనా వ్యాపించిందన్న తీవ్ర ఆరోపణలు కూడా వినిపించాయి.
ఈ నేపథ్యంలో, కరోనా వ్యాప్తిదారులు అని తమపై ముద్రవేసిన ఇతరుల కోసం తబ్లిగీలు ముందుకు వచ్చారు. కోలుకున్న తబ్లిగీలు కరోనా రోగుల చికిత్సలో ఉపయోగపడే ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇటీవల జమాత్ చీఫ్ మౌలానా సాద్ కందాల్వీ కరోనా నుంచి కోలుకున్న తబ్లిగీలకు పిలుపునిచ్చారు. కరోనా పేషెంట్ల కోసం బ్లడ్ ప్లాస్మా దానం చేయాలని సూచించారు.
అటు, ఢిల్లీ సర్కారు ప్లాస్మా దాతల కోసం ఎదురుచూస్తోంది. మతాలు, వర్గాలకు అతీతంగా ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఏర్పడతాయి. వారి నుంచి ప్లాస్మా సేకరించి కరోనా రోగుల్లో ప్రవేశపెడితే వారిలోనూ కరోనాను ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. ఇప్పుడు ప్లాస్మా థెరపీ కరోనా చికిత్సలో ఆశాకిరణంలా కనిపిస్తోంది.