DHFL: లాక్ డౌన్ సమయంలో విహారయాత్ర చేసిన డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ల అరెస్టు
- యెస్ బ్యాంకు స్కాంలో కపిల్, ధీరజ్ లపై ఆరోపణలు
- ఏప్రిల్ 9న కుటుంబ సభ్యులతో విహారయాత్రలు
- మహాబలేశ్వర్ లో అదుపులోకి తీసుకున్న సీబీఐ
యెస్ బ్యాంకు స్కాంలో నిందితులైన డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వధావన్ సోదరులను సీబీఐ ఇవాళ అరెస్టు చేసింది. యెస్ బ్యాంకు స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సోదర ద్వయం ఫిబ్రవరి 21న కోర్టు నుంచి బెయిల్ పొందింది. అయితే, దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ విధించిన వేళ వీరు తమ కుటుంబసభ్యులతో కలిసి పుణే, సతారా వెళ్లారు.
మొత్తం 21 మంది కుటుంబసభ్యులతో కలిసి పుణేలోని ఖండాలా హిల్ స్టేషన్ కు వెళ్లి, ఆపై సతారా జిల్లాలోని మహాబలేశ్వర్ వెళ్లారు. దీనిపై తీవ్ర రాజకీయ దుమారం రేగింది. వధావన్ సోదరులకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు క్వారంటైన్ లో ఉన్న కపిల్, ధీరజ్ లను సీబీఐ అధికారులు మహాబలేశ్వర్ లో అరెస్ట్ చేశారు. కాగా, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో వీరిపై దర్యాప్తు పూర్తయినట్టు మహారాష్ట్ర వర్గాలు తెలిపాయి.