Andhra Pradesh: వచ్చే 48 గంటల్లో ఏపీలోని నాలుగు జిల్లాలలో భారీ వర్షాలకు అవకాశం!
- విశాఖ, తూ.గో. కృష్ణా, గుంటూరు జిల్లాలలో వర్షాలు
- రాయలసీమలో తేలికపాటి వర్షాలు
- 30న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్టణం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా తెలిపారు.
ఆ సమయంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. రాయలసీమలో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి వానలు పడే అవకాశం ఉందన్నారు. అలాగే, ఈ నెల 30న దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు, వచ్చే మూడు రోజుల్లో కోస్తాంధ్రలోని పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు కూడా 43 డిగ్రీలకు వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.