Asteroid: భూమికి దగ్గరగా వస్తున్న గ్రహశకలం... ఫేస్ మాస్క్ ధరించినట్టుగా ఉందంటూ శాస్త్రవేత్తల చమత్కారం!
- భూమికి కరోనా ఉన్నట్టు గ్రహశకలం తెలిసిందని జోక్ లు
- 50 లక్షల మైళ్ల సమీపానికి రానున్న ఆస్ట్రాయిడ్
- అనుక్షణం గమనిస్తున్న ఏర్ సిబో అబ్జర్వేటరీ రీసెర్చర్లు
భూ మండలాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తోందన్న సంగతి గ్రహశకలాలకు కూడా తెలిసిపోయిందని, భూమికి దగ్గరగా వస్తున్న ఓ గ్రహశకలం, ఫేస్ మాస్క్ ధరించినట్టుగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు ఇప్పుడు జోక్ చేశారు.
'1998 ఓఆర్ 2' అనే పేరున్న ఈ గ్రహశకలంతో మానవాళికి ఎటువంటి ముప్పూ లేకున్నా, దాని చిత్రాలు మాత్రం అమితాసక్తిని రేపుతున్నాయి. ఈ గ్రహశకలం ముందుభాగంలో ఫేస్ మాస్క్ ఆకృతి కనిపిస్తోందని ప్యూర్టోరికో కేంద్రంగా పనిచేస్తున్న ఏర్ సిబో అబ్జర్వేటరీ రీసెర్చర్లు వెల్లడించారు.
ఈ గ్రహశకలంపై చిన్న చిన్న పరిమాణాల్లో కొండలు, గుట్టలు వంటివి ఉండడంతో, అవే మాస్క్ ఆకృతిలో కనిపిస్తున్నాయని ఏర్ సిబో లో ప్లానెటరీ రాడార్ విభాగం హెడ్ అన్నే విర్కీ వ్యాఖ్యానించారు. ఇక ప్రపంచాన్ని కరోనా పట్టుకున్నప్పటి నుంచి, ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరించాలన్న సూచనను భూమిని దాటి వెళ్లనున్న ఈ ఉల్క మానవాళికి అందిస్తోందనే భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఈ గ్రహశకలం దాదాపు 1.2 మైళ్ల పరిమాణంతో వుండచ్చని, భూమి సమీపానికి చేరువైనప్పుడు.. మన నుంచి చంద్రుడి దూరం కన్నా 16 రెట్ల దూరంలో ఇది ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీనిని ప్రమాదకర వస్తువు (PHO)గా ఖగోళ శాస్త్రజ్ఞులు వర్గీకరించారు. 500 అడుగుల వ్యాసార్థం కంటే ఎక్కువగా వుండి, భూ కక్ష్యకు 50 లక్షల మైళ్ల లోపు సమీపించే అంతరిక్ష వస్తువులను పి.హెచ్.వో లుగా వర్గీకరిస్తారు.