Agra: క్వారంటైన్ సెంటర్ల వద్ద పరిస్థితి ఇంత ఘోరమా? వైరల్ అవుతున్న యూపీలోని సంఘటన వీడియో!
- ఆగ్రాలో అనుమానితులను క్వారంటైన్ సెంటర్ కు తరలించిన అధికారులు
- కనీస ఏర్పాట్లను చేయడంలో వైఫల్యం
- తోసుకుంటూ నీరు, బిస్కెట్ల కోసం ప్రజల అవస్థలు
కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉందని భావించిన వారిని క్వారంటైన్ సెంటర్లకు తరలించిన అధికారులు, అక్కడ వారికి కనీస సదుపాయాలను కూడా కల్పించడం లేదని ఈ వీడియో స్పష్టం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్ ఇది. ఇక్కడ లోపలి వారు బయటకు రాకుండా గేట్లను అడ్డుగా పెట్టారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, వారికి కావాల్సిన ఆహారం, నీరు తదితరాలను అందించడంలో మాత్రం ఘోర వైఫల్యాన్ని ప్రదర్శించారు.
పీపీఈ కిట్ ధరించిన ఓ వ్యక్తి, బిస్కెట్లను గేటు వద్దకు విసిరి వేస్తుంటే, గేటుకు ఉన్న ఖాళీల నుంచి చేతులు బయటకు చాచి, వాటిని ప్రజలు అందుకోవాల్సిన పరిస్థితి. వాటర్ బాటిళ్లను కూడా ఇదే విధంగా గేటు దగ్గర ఉంచితే, ఏ మాత్రం భౌతిక దూరం పాటించకుండా, ఒకరిపై ఒకరు పడుతూ, వాటిని అందుకునే ప్రయత్నాలను చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. డజను వాటర్ బాటిళ్లున్న ప్యాక్ ను గేటు సందుల్లో నుంచి అందుకోలేక, ప్యాక్ ను గేటుకు ఆవలే చించే ప్రయత్నం చేసి, బాటిల్స్ ను తీసుకునేందుకు ప్రజలు పడుతున్న కష్టం కూడా ఇందులో కనిపిస్తోంది.
ఇక తమను ఇక్కడకు తెచ్చి పడేసి, కనీస సౌకర్యాలను కల్పించలేదని జ్యోతి వర్మ అనే మహిళ ఆరోపించారు. వైద్య పరీక్షలు చేస్తామని చెప్పిన అధికారులు, ఇంతవరకూ వాటిని చేయలేదని, కనీస అవసరాలను కూడా తీర్చడం లేదని ఆమె ఆరోపించారు. సరిపడినంత ఆహారం, కనీస అవసరాన్ని తీర్చేంత మంచి నీటిని కూడా అందించడం లేదని ఆమె వెల్లడించారు.
ఇక ఈ వీడియో వైరల్ కావడంతో ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే నష్ట నివారణకు రంగంలోకి దిగిన అధికారులు, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న వారందరి అవసరాలను తీర్చే ఏర్పాటు చేశామని, వీరికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు, నమూనాలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపుతున్నామని తెలిపారు.