Vijayawada: రెడ్ జోన్ లో బయట కనిపిస్తే క్వారంటైన్ సెంటర్ కు తరలిస్తామన్న విజయవాడ పోలీసులు!
- విజయవాడలో 150కి పైగా పాజిటివ్ కేసులు
- నిబంధనలు పాటించక పోవడమే కారణమన్న అధికారులు
- కేసులు పెరిగే కొద్దీ పోలీసు ఆంక్షలు కఠినమన్న కలెక్టర్ ఇంతియాజ్
కృష్ణా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూ వుంది. దీంతో రెడ్ జోన్లు, కంటైన్ మెంట్ జోన్ లు కూడా అధికమయ్యాయి. ప్రజలు తమకిచ్చిన లాక్ డౌన్ సౌలభ్యాలను దుర్వినియోగం చేస్తూ, వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నారన్న ఉద్దేశంతో, నిబంధనలను మరింత కఠినం చేశారు అధికారులు. ప్రజలు బాధ్యతారహితంగా వ్యవహరించరాదని, బయట కనిపించిన వారిని కనిపించినట్టు క్వారంటైన్ సెంటర్ కు తరలించి, అక్కడే 14 రోజుల పాటు ఉంచుతామని హెచ్చరించారు.
ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నూతన ఆదేశాలు జారీ చేస్తూ, విజయవాడలో నిబంధనలు పాటించని కారణంగానే కేసులు పెరిగాయని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ప్రజలు బయట తిరుగుతున్న ప్రాంతాల్లోనే కేసుల సంఖ్య అధికంగా ఉందని గుర్తు చేసిన ఆయన, కేసులు పెరిగే కొద్దీ పోలీసుల చర్యలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. నగర పరిధిలో కేసులు అధికంగా ఉన్న కృష్ణ లంకలో కలెక్టర్ ఇంతియాజ్, పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి పరిస్థితులను కలెక్టర్ పరిశీలించారు.
బాధ్యత మరచిన ప్రజల కారణంగానే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నిరుపయోగం అవుతున్నాయని, విజయవాడ పరిధిలో 150కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు వ్యాఖ్యానించారు. కరోనాపై పోరాటంలో వైద్యులు, వలంటీర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు అనుక్షణం శ్రమిస్తున్నారని, వారికి ప్రజలంతా సహకరించాలని అన్నారు.
జిల్లాలో కరోనా వ్యాప్తికి కారణమవుతున్న వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని, ఇప్పటికే సరైన కారణం లేకుండా బయటకు వచ్చిన వారికి సంబంధించిన 6 వేలకు పైగా వాహనాలను సీజ్ చేశామని, లాక్ డౌన్ ముగిసిన తరువాతనే వాహనాల అప్పగింత ఉంటుందని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. రెడ్ జోన్లలో పోలీసింగ్ కొనసాగుతుందని, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టి, బయటకు వచ్చిన వారిని గుర్తిస్తామని ఆయన హెచ్చరించారు.