Gurugram: జూలై 31 వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్... గురుగ్రామ్ ఐటీ కంపెనీలకు ఆదేశం!
- ఎంఎన్సీ, ఐటీ, బీపీఓలకు అనుమతి
- నిర్మాణ రంగ ప్రాజెక్టులు కొనసాగించేందుకు ఓకే
- సోషల్ డిస్టెన్స్, మాస్క్ లు తప్పనిసరన్న అధికారులు
కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న ఈ తరుణంలో జూలై 31 వరకూ గురుగ్రామ్ లోని మల్టీ నేషనల్ ఐటీ కంపెనీల ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతులు ఇవ్వాలని హర్యానా సర్కారు ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని ఎంఎన్సీలు, బీపీఓలు, ఐటీ ఈఎస్ సంస్థలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని, మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీఎస్ కుందూ తెలియజేశారు.
ఇప్పటికే తాము కొన్ని లాక్ డౌన్ నిబంధనలను సడలించామని, డీఎల్ఎఫ్ సహా రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రాజెక్టులు కొనసాగించేందుకు అనుమతించామని అన్నారు. అయితే, వైరస్ విస్తరించకుండా మాస్క్ లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరని అన్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
కాగా, గురుగ్రామ్ లో గూగుల్, మైక్రోసాఫ్ట్, జెన్ పాక్ట్, ఇన్ఫోసిస్ సహా ఎన్నో కంపెనీలున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలూ వర్క్ ఫ్రమ్ హోమ్ ను కొనసాగిస్తున్నాయి. ఇక్కడి కొన్ని కంపెనీలు పీపీఈ కిట్లను, మాస్క్ లను కూడా తయారు చేస్తున్నాయి. అయితే, గురుగ్రామ్ లోని ఆటో మొబైల్ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో 51 మందికి కరోనా సోకడంతో, ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్ గా గుర్తించిన అధికారులు, నిబంధనలను కఠినం చేశారు. ముఖ్యంగా నుహ్, ఫరీదాబాద్, పాల్వాల్ ప్రాంతంలో పరిశ్రమలను తెరిచేందుకు ఇంకా అనుమతి లభించలేదు.