Amazon: మా వినతిని మన్నించండి.. ఎందరికో చేయూతను అందించినట్టవుతుంది: కేంద్ర ప్రభుత్వానికి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ విన్నపం!
- లాక్ డౌన్ నేపథ్యంలో ఈ కామర్స్ సంస్థలపై ఆంక్షలు
- అత్యవసర వస్తువుల అమ్మకాలకే పర్మిషన్
- అత్యవసరం కాని వస్తువుల అమ్మకాలకు కూడా పర్మిషన్ ఇవ్వాలన్న ఈకామర్స్ సంస్థలు
అత్యవసరం కాని వస్తువులను (నాన్ ఎస్సెన్షియల్) కూడా అమ్మేందుకు తమను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈకామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కోరాయి. ఈ వస్తువులను కూడా అమ్మాలని వినియోగదారుల నుంచి తమకు డిమాండ్లు వస్తున్నాయని తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే... సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ, అన్ని వస్తువులను సురక్షితంగా వినియోగదారులకు అందిస్తామని చెప్పాయి.
లాక్ డౌన్ నేపథ్యంలో అవసరమైన వస్తువులు లభించక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని... తమపై ఉన్న ఆంక్షలను సడలిస్తే... సురక్షితమైన విధానాల ద్వారా ప్రజలకు వస్తువులను అందిస్తామని ఈ సంస్థలు తెలిపాయి. తద్వారా కరోనా మహమ్మరిపై చేస్తున్న పోరాటంలో తాము కూడా భాగస్వాములం అవుతామని చెప్పాయి. ప్రజలు సురక్షితంగా ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపాయి. తమ విన్నపానికి అంగీకరిస్తే... దేశ వ్యాప్తంగా చిన్న వ్యాపారాలు చేసుకునే వారందరికీ చేయూత అందించినట్టవుతుందని చెప్పాయి.
గత నెలలో లాక్ డౌన్ ను ప్రధాని మోదీ ప్రకటించిన వెంటనే... ఈ కామర్స్ సంస్థలపై ఆంక్షలను విధించారు. కేవలం అత్యవసర వస్తువుల అమ్మకాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇప్పటికీ ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి.