Narendra Modi: కరోనాపై పోరాటం, ఆర్థిక పునరుజ్జీవం రెండూ ముఖ్యమే: సీఎంలతో మోదీ
- సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్
- సామాన్యులను ఆకట్టుకునేలా సంస్కరణలు తీసుకురావాలని సూచన
- మాస్కులు నిత్యజీవితంలో భాగం కావాలని పిలుపు
ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. కరోనా నివారణ చర్యలు, వైరస్ వ్యాప్తి తీరుతెన్నులు, రాష్ట్రాల్లో లాక్ డౌన్ పరిస్థితులపై ఆయన సీఎంలతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉందని, సామాన్యులను ఆకట్టుకునేలా సంస్కరణలు తీసుకురావాలని సూచించారు. అయితే, ఓవైపు కరోనాపై పోరాటం చేస్తూనే మరోవైపు ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవంపైనా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. తద్వారా లాక్ డౌన్ సడలింపులపై సంకేతాలు పంపించారు.
కరోనా వైరస్ ప్రభావం మున్ముందు కొన్ని నెలల పాటు ఉంటుందని, మాస్కులు, ఇతర కవచాలు మన నిత్యజీవితంలో భాగం కావాలని పేర్కొన్నారు. లాక్ డౌన్ అమలు సత్ఫలితాలను ఇచ్చిందని, తద్వారా ఒకటిన్నర నెలల కాలంలో వేలమంది ప్రాణాలు నిలిచాయని తెలిపారు. సీఎంలు తమ రాష్ట్రాల్లో కరోనా కేసుల తగ్గింపునకు కృషి చేయాలని, రెడ్ జోన్లను ఆరెంజ్ జోన్లుగా, ఆరెంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు.