Rajanikanth: రజనీకాంత్ గొప్పతనం అదే: కొరియోగ్రఫర్ తరుణ్ మాస్టర్
- రజనీకాంత్ క్రమశిక్షణ కలిగిన హీరో
- చెప్పిన సమయానికి గంట ముందుగానే వచ్చేస్తారు
- ఆయన సింప్లిసిటీ ఆశ్చర్య పరుస్తుందన్న తరుణ్ మాస్టర్
తెలుగు .. తమిళ .. హిందీ భాషా చిత్రాలకు కొరియోగ్రఫీని అందించిన తరుణ్ మాస్టర్ మంచి పేరు తెచ్చుకున్నాడు. తమిళంలో ఆయన రజనీకాంత్ సినిమాలకు ఎక్కువగా పనిచేశారు. తాజా ఇంటర్వ్యూలో తరుణ్ మాస్టర్ మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.
"రజనీకాంత్ కి ఒక సినిమా షూటింగ్ సమయంలో రెండు మోకాళ్లు దెబ్బతిన్నాయి. అందువలన ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పాటలకు డాన్స్ ను కంపోజ్ చేసేవాడిని. ఆయన స్టైల్ ను జోడిస్తూ తేలికగా వుండే మూమెంట్స్ ను కంపోజ్ చేసేవాడిని. 'ముత్తు'లో 'థిల్లానా థిల్లానా ..' డాన్స్ అలాంటిదే. అమితాబ్ తరువాత నేను చూసిన క్రమశిక్షణ కలిగిన స్టార్స్ లో రజనీ ఒకరు. ఉదయం 7 గంటలకు షూటింగు అంటే, ఆయన 11 గంటలకు వచ్చినా అడిగేవారు లేరు. కానీ ఆయన 6 గంటలకే మేకప్ వేసుకుని సెట్లో సిద్ధంగా ఉండేవారు. సెట్లో ఆయన చాలా సింపుల్ గా ఉండేవారు. ఎన్నిసార్లు రిహార్సల్ అయినా విసుక్కోకుండా చేసేవారు. అలసిపోతే చిన్నపాటి స్టూల్ పై కూర్చునేవారు" అంటూ చెప్పుకొచ్చారు.