Corona Virus: ప్రసవం కోసం నిండు గర్భిణి పాట్లు.. 200 కిలోమీటర్ల ప్రయాణం.. తల్లీబిడ్డల మృతి!
- 24న నొప్పులు రావడంతో ఆసుపత్రికి జమీలా
- రక్తం తక్కువగా ఉందని తొలుత మహబూబ్ నగర్ కు, ఆపై హైదరాబాద్ కు
- కరోనా టెస్టులు చేయించుకుని రావాలన్న వైద్యులు
- చివరకు పరిస్థితి విషమించి ఉస్మానియాలో కన్నుమూత
కరోనా కారణంగా లాక్ డౌన్ అయితేనేమి, వైద్యులు, అధికారుల నిర్లక్ష్యం అయితేనేమి, ఓ తల్లి, నవజాత శిశువు మరణించారు. ఈ ఘటన జోగులాంబ జిల్లాలో జరిగింది. ప్రసవానికి వచ్చిన మహిళను 200 కిలోమీటర్లు తిప్పి, ఆరు ఆసుపత్రులకు పంపగా, చివరకు బిడ్డను కన్న తరువాత, ఆ తల్లి, బిడ్డా ఇద్దరూ మరణించారు. ఈ దయనీయ ఉదంతానికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే...
జోగులాంబ జిల్లా అయిజ మండలానికి చెందిన జెనీలా (20)కు నెలలు నిండటంతో కాన్పు కోసం 24న జిల్లా ఆసుపత్రికి చేరుకుంది. ఆమెకు రక్తం తక్కువగా ఉండటం, బీపీ అధికంగా కనిపించడంతో, కర్నూలు ఆసుపత్రికి వెళ్లాలని అధికారులు సూచించారు. లాక్ డౌన్ సమస్యతో కర్నూలుకు చేరుకునే అవకాశం లేకపోవడంతో విషయం తెలిసి కల్పించుకున్న కలెక్టర్, మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్ కు పంపారు.
అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, పరిస్థితి విషమంగా ఉందని భావించి, హైదరాబాద్ లోని కోఠీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడికి చేరుకున్న జనీలాను, కరోనా హాట్ స్పాట్ నుంచి వచ్చిన కారణంగా, తొలుత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. గాంధీ ఆసుపత్రికి వెళ్లి, కరోనా పరీక్షలు చేయించుకుని, నెగటివ్ రిపోర్టుతో తిరిగి పేట్ల బురుజు దవాఖానాకు ఆమె చేరుకోగా, శనివారం నాడు వైద్యులు సిజేరియన్ చేయగా, బాబు పుట్టాడు.
పుట్టిన బాబుకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో, పేట్ల బురుజు వైద్యులు, నీలోఫర్ కు రిఫర్ చేశారు. నీలోఫర్ లో చికిత్స పొందుతూ, బాలుడు కన్నుమూశాడు. ఈలోగా జనీలా పరిస్థితి విషమించడంతో, ఆమెను ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె నిన్న రాత్రి 8.30 గంటలకు కన్నుమూసింది. కరోనా అనుమానంతో తమను ఆసుపత్రుల చుట్టూ తిప్పించారని, సకాలంలో ఆపరేషన్ చేసుంటే తల్లీ బిడ్డలు దక్కేవారని జనీలా భర్త మహేందర్ వాపోయాడు.
కాగా, జనీలాకు ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, ఆమెను చాలా ఆలస్యంగా తమ వద్దకు తీసుకుని వచ్చారని పేట్ల బురుజు ఆసుపత్రి వైద్యులు చెప్పారు. గర్భం దాల్చిన తరువాత, వైద్య పరీక్షలు చేయించుకున్న రిపోర్టులు కూడా వారి వద్ద ఏమీ లేవని తెలిపారు.