Chiranjeevi: జనసేనకే నా మద్దతు.. నా తమ్ముడి గురించి నాకు పూర్తిగా తెలుసు: ఫుల్ క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
- చెరొక పార్టీలో ఉంటే అభిమానులు అయోమయానికి గురవుతారు
- పవన్ చాలా పట్టుదల ఉన్న వ్యక్తి
- తమ్ముడికి రాజకీయ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు
రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న చిరంజీవి... ఆమధ్య ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో చిరంజీవి చేరబోతున్నారని... ఆయనకు రాజ్యసభ సీటును ఆఫర్ చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి అన్ని వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ, ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకే తన మద్దతు అని చిరంజీవి స్పష్టం చేశారు. తానొక పార్టీలో, తమ్ముడు మరొక పార్టీలో ఉంటే... తమను గుండెల్లో పెట్టుకుని ఆరాధించే అభిమానులు అయోమయానికి గురవుతారని... అలాంటి పరిస్థితి తలెత్తకూడదని చెప్పారు. అందుకే జనసేనకు మద్దతు పలుకుతున్నానని తెలిపారు.
పవన్ కల్యాణ్ గురించి తనకు పూర్తిగా తెలుసని... చాలా పట్టుదల ఉన్న వ్యక్తి అని చిరంజీవి చెప్పారు. ఈరోజు కాకపోయినా... రేపటి రోజైనా తాను అనుకున్నది సాధిస్తాడని అన్నారు. ఒక అన్నగా పవన్ పై తనకు నమ్మకం ఉందని చెప్పారు. తమ కుటుంబం మొత్తం పవన్ వెంటే ఉంటుందని అన్నారు.
తమ దారులు వేరైనా... గమ్యం మాత్రం ఒకటేనని చిరంజీవి చెప్పారు. పవన్ కు రాజకీయ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పని చేసిన అనుభవం పవన్ కు ఉందని చెప్పారు.
అప్పట్లో పార్టీలో జరిగిన పరిణామాలను పవన్ దగ్గరుండి చూశాడని... నేను చేరదీసిన వాళ్లు నన్ను దెబ్బతీశారనే భావన పవన్ లో ఉందని... నాకు తగిలిన ఎదురు దెబ్బల నుంచి పవన్ గుణపాఠం నేర్చుకున్నాడని తెలిపారు. అందుకే అలాంటి తప్పులు మళ్లీ జరగకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. తాము కలుకున్నప్పుడు తమ మధ్య రాజకీయపరమైన చర్చలు రావని తెలిపారు.