North Korea: కిమ్ ఆరోగ్యంపై స్పష్టతనిచ్చే వార్త ప్రచురించిన ఉత్తరకొరియా మీడియా
- ఏప్రిల్ 27న కిమ్ జోంగ్ ఉన్ పేరు మీద ఉన్న ఓ లేఖ విడుదల
- దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కిమ్ లేఖ
- దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కిమ్ జోంగ్ ఉన్ శుభాకాంక్షలు
- లేఖను స్వయంగా కిమ్ జోంగ్ ఉన్ పంపారని క్లారిటీ
ఉత్తర కొరియా అధ్యకుడు కిమ్ జోంగ్ ఉన్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, కదలలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎన్నో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై స్పష్టతనిచ్చేలా ఉత్తరకొరియా మీడియా ఓ వార్త ప్రచురించింది. ఏప్రిల్ 27న కిమ్ జోంగ్ ఉన్ పేరు మీద ఉన్న ఓ లేఖను అక్కడి మీడియా విడుదల చేసింది.
దక్షిణాఫ్రికా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడికి కిమ్ జోంగ్ ఉన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ లేఖను విడుదల చేసినట్లు పేర్కొంది. ఈ లేఖను స్వయంగా కిమ్ జోంగ్ ఉన్ పంపారని చెప్పింది. ఉత్తరకొరియా వార్తతో కిమ్ క్షేమంగానే ఉన్నారని స్పష్టమవుతోంది.
కిమ్ ఆరోగ్య పరిస్థితిపై అమెరికాతో పాటు దక్షిణ కొరియా, చైనా వంటి దేశాలు పలు సందర్భాల్లో స్పందించిన విషయం తెలిసిందే. ఆయన క్షేమ సమాచారం తెలుసుకునేందుకు అమెరికా టెక్నాలజీని కూడా బాగా వాడుతోంది.
కిమ్ ఆరోగ్యం బాగోలేదంటూ వస్తోన్న వదంతులను ఇప్పటికే అమెరికాతో పాటు దక్షిణ కొరియా కొట్టిపారేశాయి. ఆయన క్షేమంగానే ఉన్నారని తాము భావిస్తున్నట్లు అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది. కిమ్ బతికే ఉన్నారని దక్షిణ కొరియా కూడా తెలిపింది. ఆయన ఆరోగ్యం కూడా బాగుందని చెప్పింది.