Andhra Pradesh: వలస కూలీలకు ఏపీ సర్కారు గుడ్న్యూస్.. సొంత గ్రామాలకు పంపేందుకు మార్గదర్శకాలు!
- వలసకూలీలు ఎంతమంది ఉన్నారో లెక్కించాలని కలెక్టర్లకు ఆదేశం
- ర్యాపిడ్ విధానంలో కరోనా పరీక్షలు
- నెగెటివ్ వచ్చిన కూలీలను స్వస్థలాలకు
- సొంతూరికి వెళ్లాక 14 రోజుల పాటు క్వారంటైన్
ఉపాధి కోసం వలస వెళ్లి పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కూలీలకు ఏపీ సర్కారు గుడ్న్యూస్ చెప్పింది. వారిని సొంత గ్రామాలకు పంపేందుకు సిద్ధమైంది. ఇందుకు తగ్గ మార్గదర్శకాలు విడుదల చేసింది. వలసకూలీలు ఎక్కడ ఎంతమంది ఉన్నారో లెక్కించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది.
వలస కూలీలకు ర్యాపిడ్ విధానంలో కరోనా పరీక్షలు నిర్వహించాలని రవాణా శాఖ తెలిపింది. నెగెటివ్ వచ్చిన కూలీలను మాత్రమే స్వస్థలాలకు అనుమతించాలని పేర్కొంది. వలస కూలీలు బృందాలుగా ఉంటే ఆ బృందంలో ఒక్కరికి పాజిటివ్ వచ్చినా వారంతా ఉన్నచోటే ఉండాలని తెలిపింది.
కరోనా నిబంధనల మేరకు వారికి కూడా వైద్యం అందించాలని రవాణా శాఖ చెప్పింది. నెగెటివ్ వచ్చిన వారిని స్వగ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించింది. ప్రస్తుతం గ్రీన్ జోన్లో ఉన్నవారు మాత్రమే తమ సొంత ప్రాంతాలకు వెళ్లొచ్చని తెలిపింది.
బస్సులో 50 శాతం సీట్లలో మాత్రమే కూలీలు కూర్చునేందుకు అనుమతి ఇస్తూ ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ వివరించింది. భౌతిక దూరం పాటిస్తూ కూలీలు కూర్చోవాలని తెలిపింది. సొంతూరికి వెళ్లాక 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది. ఆ తర్వాత హోం క్వారంటైన్లో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది.