hunger Deaths: కరోనా కొనసాగితే మరో విలయం... రోజుకు 3 లక్షల ఆకలి చావులు తప్పవన్న వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చీఫ్!
- మొత్తం 3 కోట్ల మంది మరణించే అవకాశం
- పేద దేశాలకు నిధులను ఆపవద్దు
- అగ్ర రాజ్యాలను కోరిన డేవిడ్ బిస్లే
కరోనా మహమ్మారి మరణమృదంగం ఇదే విధంగా కొనసాగితే, ఆకలి చావులు ఉద్ధృతంగా ఉంటాయని వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ చీఫ్ డేవిడ్ బిస్ హెచ్చరించారు. మరో మూడు నెలల్లో రోజుకు మూడు లక్షల చొప్పున ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావులు పెరిగిపోతాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆహార సంక్షోభం దిశగా ప్రపంచం పయనిస్తోందని, ఇది ఇలాగే కొనసాగితే మొత్తం 3 కోట్ల మంది వరకూ చనిపోయే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
చాలా పేద దేశాలు ఆర్థికంగా చితికిపోగా, ఇప్పటికే కోట్లాది మంది ఆకలితో బాధపడుతూ ఉన్నారని, ఇటువంటి సమయంలో ఐరాస ఇచ్చే నిధుల్లో కోత విధించడం తగదని ఆయన అభివృద్ధి చెందిన దేశాలకు విన్నవించారు. కావాల్సినంత నిధులు సమకూరితే, ఆకలి చావులను నివారించే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ తరఫున 10 కోట్ల మందికి ఆహారాన్ని అందిస్తున్నామని, అందులో 3 కోట్ల మంది పూర్తిగా తామిచ్చే ఆహారంపైనే ఆధారపడనున్నారని వెల్లడించారు. వీరికి సమయానికి ఆకలి తీరకుంటే, కరోనాను మించిన విలయాన్ని కళ్లజూడాల్సి వస్తుందని హెచ్చరించారు.