Mumbai: 55 ఏళ్లు నిండిన పోలీసులు విధులకు రావద్దు: ముంబై పోలీస్ కమిషనర్ కీలక ఆదేశాలు
- ముంబైలో కరోనాతో ముగ్గురు పోలీసుల మృతి
- దీంతో చర్యలు తీసుకుంటున్న అధికారులు
- 94 పోలీసు స్టేషన్‌లకు కమిషనర్ ఆదేశాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కరోనా బారిన పడి ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ముంబైలో 55 ఏళ్లు నిండిన వారెవ్వరూ విధులకు హాజరయ్యే అవసరం లేదని ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బిర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు ఆయన 94 పోలీసు స్టేషన్‌లకు ఈ ఆదేశాలను పంపారు. ఒకవేళ 55 ఏళ్లు దాటిన పోలీసులు విధులకు తప్పనిసరిగా హాజరుకావాల్సి వస్తే వారికి కరోనా సంబంధిత విధులు అప్పజెప్పవద్దని చెప్పారు. ఎందుకంటే వారు కరోనా వైరస్ బారినపడే అవకాశాలు అధికంగా ఉంటాయని వివరించారు. అలాగే, 50 ఏళ్లు దాటిన వారు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే లీవ్ తీసుకోవాలని చెప్పారు.
ముంబైలో 5,500 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 219గా ఉంది. 56 ఏళ్ల ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ నిన్న ట్రాఫిక్ విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ముంబైలో లాక్‌డౌన్‌ను అమలు చేయడానికి ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారని ఓ పోలీసు అధికారి చెప్పారు. కరోనా కట్టడి ప్రాంతాల్లోనూ పోలీసులు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.