China: భారత్ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన చైనా!

China Deeply Concerned As India Cancels Orders of corona testing kits
  • నాసిరకం టెస్టింగ్ కిట్లను సరఫరా చేసిన చైనా కంపెనీలు
  • ఆ కిట్లను ఉపయోగించకూడదని నిర్ణయించిన భారత్
  • ఎగుమతుల విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తామన్న చైనా
తమ దేశానికి చెందిన రెండు కంపెనీలు తయారు చేస్తున్న కరోనా టెస్టింగ్ కిట్స్ ను వాడకూడదంటూ భారత్ తీసుకున్న నిర్ణయంపై చైనా ఆందోళనకు గురవుతోంది. భారత్ తీసుకున్న నిర్ణయం ఆందోళనకరమని చైనా తెలిపింది. ఈ సమస్యకు భారత్ ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నామని చెప్పింది.

నాసిరకం కిట్లను సరఫరా చేసిన చైనా కంపెనీలకు ఒక్క రూపాయి కూడా  చెల్లించబోమని... ఆర్డర్లను క్యాన్సిల్ చేసుకుంటున్నామని నిన్న భారత్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో చైనా ఎంబసీ అధికార ప్రతినిధి జి రోంగ్ మాట్లాడుతూ, పరీక్షల ఫలితాలు, ఐసీఎంఆర్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని అన్నారు. ఎగుమతి చేసే వైద్య పరికరాలు, సామగ్రి విషయంలో చైనా అత్యున్నత ప్రమాణాలను పాటిస్తుందని చెప్పారు.

చైనా ఉత్పత్తులు సరిగా పని చేయడం లేదని కొందరు నిందలు వేయడం సరికాదని రోంగ్ అన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో పక్షపాతం లేకుండా వ్యవహరించాలని చెప్పారు. వాస్తవ పరిస్థితి ఏమిటో కనుక్కునేందుకు ఐసీఎంఆర్, చైనా కంపెనీలతో తమ దౌత్య కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటుందని ఆమె తెలిపారు. గ్వాంఝౌ వోండ్ ఫో బయోటెక్, ఝుహై లివ్ జోన్ డయాగ్నోస్టిక్స్ కంపెనీలు ఎగుమతి చేస్తున్న కిట్లకు లాటిన్ అమెరికా, ఆసియా, ఐరోపా దేశాల్లో మంచి గుర్తింపు ఉందని చెప్పారు.

అందరం కలసికట్టుగా పనిచేయడం ద్వారానే ఈ మహమ్మారిపై మనం గెలవగలమని ఆమె అన్నారు. ఇప్పుడు భారత్ అనుభవిస్తున్న బాధను ఇంతకు ముందు చైనా అనుభవించిందని... కరోనాపై పోరాడేందుకు భారత్ కు చైనా మద్దతు ఇస్తుందని చెప్పారు.
China
Corona Virus
Testing Kits
India

More Telugu News