Lungs: కరోనా నుంచి కోలుకున్నా... ఊపిరితిత్తులకు భారీ డ్యామేజి.. చైనా అధ్యయనాల వెల్లడి
- కరోనా కారణంగా రోగుల్లో తీవ్ర న్యూమోనియా
- కోలుకున్నా గానీ ఊపిరితిత్తులకు భారీ నష్టం
- కరోనాతో రెండు ఊపిరితిత్తులూ ఇన్ఫెక్షన్ కు గురవుతున్నట్టు గుర్తింపు
ప్రాణాంతక కరోనా వైరస్ కు చైనా జన్మస్థానంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక్కడి వుహాన్ నగరంలో మొదలైన కరోనా వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘంటికలు మోగిస్తోంది. ప్రస్తుతం చైనాలో కరోనా కల్లోలం చాలావరకు సద్దుమణిగినట్టే. అయితే, ఓ అధ్యయనంలో దిగ్భ్రాంతికర అంశాలు వెల్లడయ్యాయి. కరోనా నుంచి కోలుకుని ప్రాణాలు కాపాడుకున్న రోగుల్లో చాలావరకు ఊపిరితిత్తుల డ్యామేజీ జరిగినట్టు గుర్తించారు. మున్ముందు వారు ఊపిరితిత్తుల పరంగా అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కొవిడ్-19 న్యూమోనియాకు గురై కోలుకున్న 70 మందిలో 66 మంది ఊపిరితిత్తులు కొంతమేర పాడైనట్టు వారిని డిశ్చార్జి చేసే సమయంలో తీసిన సీటీ స్కాన్ లో తేలింది. ఆక్సిజన్ ను గ్రహించే సన్నని వాయుకోశాల కణజాలం దెబ్బతిన్నట్టు గుర్తించామని పరిశోధకులు తెలిపారు.
ఈ విధంగా ఇన్ఫెక్షన్ కు గురైన సంబంధిత కణజాల ప్రాంతాలు దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతాలని హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ కు చెందిన రేడియాలజిస్ట్ యుహుయ్ వాంగ్ తెలిపారు. గతంలో సార్స్, మెర్స్ బాధితుల్లోనూ ఊపిరితిత్తుల్లో ఇలాంటి సమస్యలనే గుర్తించినట్టు వెల్లడించారు. వీటన్నింటి దృష్ట్యా, కరోనా నుంచి కోలుకున్నా గానీ, శాశ్వతంగా ఊపిరితిత్తుల సమస్య తప్పదని అభిప్రాయపడ్డారు.
అయితే, సార్స్, మెర్స్ వైరస్ లు సోకిన రోగుల్లో ఒక ఊపిరితిత్తి మాత్రమే ఇన్ఫెక్షన్ కు గురైందని, కానీ ఇప్పటి కొవిడ్-19 వైరస్ ప్రభావంతో రెండు ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ కు గురవుతున్నట్టు గుర్తించామని యుహుయ్ వాంగ్ వివరించారు. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 17 మధ్య కాలంలో హువాజోంగ్ వర్సిటీ ఆసుపత్రిలో చేరిన 90 మంది కరోనా రోగుల్లో 75 మందిలో రెండు ఊపిరితిత్తులు సమస్యాత్మకంగా ఉన్నట్టు సీటీ స్కాన్లు చెబుతున్నాయని తెలిపారు.
కొందరు రోగుల్లో ఈ సమస్య క్రమేపీ తగ్గే అవకాశాలు ఉన్నాయని, కొందరిలో కణజాలం మరింత గట్టిపడి పల్మనరీ ఫైబ్రోసిస్ గా రూపాంతరం చెందుతుందని, ఇలాంటి వారిలో తగినంత ఆక్సిజన్ అందిపుచ్చుకోవడం సాధ్యం కాదని తెలిపారు. వీరికి దీర్ఘకాలిక సమస్యలు తప్పవని పేర్కొన్నారు.