Tablighi Jamaat: పాపం చేసిన కొందరు 'కరోనా యోధులు'గా చెప్పుకోవడం సిగ్గుచేటు: నఖ్వీ
- దేశభక్తులైన కొందరు ముస్లింలు ప్లాస్మా దానం చేస్తున్నారు
- కొందరు తబ్లిగీలు వైరస్ వ్యాప్తికి కారణమయ్యారు
- ప్రతి ముస్లింను తబ్లిగీగా చూపించేందుకు కుట్ర జరుగుతోంది
కరోనా వైరస్ నుంచి కోలుకుని ప్లాస్మాను డొనేట్ చేస్తున్న కొందరు ముస్లింలను కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రశంసించారు. ఇదే సమయంలో... నేరపూరిత స్వభావంతో కొందరు తబ్లిగీ జమాత్ సభ్యులు వైరస్ వ్యాప్తికి కారణమయ్యారని, పాపం చేసిన వీరంతా కరోనా యోధులుగా చెప్పుకోవడం సిగ్గు చేటని మండిపడ్డారు. దీన్నే తప్పు చేసి గొప్పలు చెప్పుకోవడం అంటారని విమర్శించారు.
దేశ భక్తులైన కొందరు ముస్లింలు ప్లాస్మా దానం చేస్తున్నారని... వారందరినీ తబ్లిగీ అనడం సరికాదని నఖ్వీ అన్నారు. దేశంలో ప్రతి ముస్లింను తబ్లిగీగా చూపించేందుకు 'ప్రణాళికాబద్ధమైన నీచ తబ్లిగీ కుట్ర' జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.