Sachin Tendulkar: వెనక్కి వెళ్లి మరో బంతి విసురు... నేనిక్కడే ఉంటా: మెక్ గ్రాత్ ను కవ్వించిన సచిన్
- సచిన్, మెక్ గ్రాత్ మధ్య ఆసక్తికర పోరాటాలు
- 1999 అడిలైడ్ టెస్టు ముచ్చట్లు చెప్పిన సచిన్
- ఆసీస్ బౌలర్లు వ్యూహానికి కట్టుబడి బౌలింగ్ చేశారని వెల్లడి
- రెండుమూడు ఫోర్లు కొట్టి ఒత్తిడి తగ్గించుకున్నానని వివరణ
క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్ ఎవరెస్ట్ శిఖరం వంటి ఆటగాడు. ఆటతీరే కాదు, సచిన్ మనస్సు కూడా ఉన్నతం. ఇక ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ తన కాలంలో అత్యుత్తమ బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. సచిన్, మెక్ గ్రాత్ అనేక సందర్భాల్లో పరస్పరం తలపడగా, కొన్నిసార్లు సచిన్, మరికొన్నిసార్లు మెక్ గ్రాత్ పైచేయి సాధించారు. చాలవరకు సచన్ ఎంతో సంయమనంతో ఆడి తన స్థాయిని నిరూపించుకున్నాడు.
మెక్ గ్రాత్ తో తన పోరాటాలను ఓ ఇంటర్వ్యూలో సచిన్ వెల్లడించిన వీడియోను బీసీసీఐ తాజాగా ట్వీట్ చేసింది. అందులో సచిన్ మాట్లాడుతూ, 1999లో అడిలైడ్ టెస్టులో ఆసీస్ బౌలర్లు తనను చికాకు పెట్టేలా వ్యవహరించారని, అది వాళ్ల వ్యూహం అని తెలిపాడు.
"70 శాతం బంతులు నేరుగా వికెట్ కీపర్ చేతిలో పడేలా విసరాలని, 10 శాతం బంతులు బ్యాట్ కు దగ్గర్లో విసరాలని నిర్ణయించుకున్నారు. ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతులను నేను వెంటాడే ప్రయత్నం చేస్తే తాము సక్సెస్ అయినట్టేనని ఆసీస్ బౌలర్లు భావించారు. నేను సాధ్యమైనంత వరకు బంతులను ఆడకుండా వదిలేస్తున్నాను. ఆ సమయంలో మెక్ గ్రాత్ బౌలింగ్ కు దిగి వరసగా ఐదారు మెయిడెన్లు విసిరాడు. వాటిలో కొన్ని మంచి బంతులు కూడా ఉన్నాయి. అదే పనిగా ఒకే లైన్ లో బంతులు విసురుతూ చిరాకు పుట్టించేందుకు ప్రయత్నించాడు. దాంతో, "బాగా బౌలింగ్ చేస్తున్నావు. వెనక్కి వెళ్లి, మరో బాల్ వేయి... నేనిక్కడే ఉంటా!" అని చెప్పాను. ఆ మరుసటి రోజు ఉదయం కూడా మెక్ గ్రాత్ తో నా పోరాటం కొనసాగింది. అయితే రెండుమూడు బౌండరీలు బాదడంతో ఒత్తిడి అతడిపైకి మళ్లింది" అని వివరించాడు.