Simhachalam: అప్పన్న చందనోత్సవంలో అపచారం... ప్రధానార్చకుడి సస్పెన్షన్!
- ఏకాంతంగా సాగిన అప్పన్న చందనోత్సవం
- ఒక వ్యక్తిని ఆలయంలోకి తీసుకెళ్లిన ప్రధానార్చకుడు
- వెల్లువెత్తిన విమర్శలు.. కేసు పెట్టిన ఈఓ
ప్రతి సంవత్సరమూ అత్యంత వైభవోపేతంగా జరిగే సింహాచలం అప్పన్న చందనోత్సవం, ఈ సంవత్సరం లాక్ డౌన్ కారణంగా, ఏకాంతంగా జరుగుతూ ఉండగా, ఆలయంలో అపశ్రుతి చోటు చేసుకుంది. చందనోత్సవం జరుగుతున్న వేళ, ఉత్సవానికి ఎటువంటి సంబంధమూ లేని శ్రీను అనే వ్యక్తి, ప్రధానార్చకుడు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు సహకారంతో ఆలయంలోకి ప్రవేశించాడు.
ఈ విషయంపై విమర్శలు రావడంతో గోపాలకృష్ణమాచార్యులును సస్పెండ్ చేస్తున్నట్టు ఈఓ వెంకటేశ్వరరావు ప్రకటించారు. జరిగిన తప్పుపై విచారణ జరిపించామని, ఆలయ నిబంధనలను అతిక్రమించినందుకు గోపాలకృష్ణమాచార్యులపై, ఆలయంలోకి వచ్చిన శ్రీనుపై కేసు కూడా పెట్టామని తెలిపారు. కాగా, లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతపడగా, సింహాచలంలో మాత్రం కొందరు ప్రైవేటు వ్యక్తులకు స్వామి దర్శనాలు చేయిస్తున్నారన్న విమర్శలు గత కొంతకాలంగా వస్తున్నాయి.