Kerala: మాస్క్ తో పాటు గొడుగునూ తప్పనిసరి చేసిన కేరళ గ్రామ పంచాయతీ!
- కేరళలో గ్రామ పంచాయితీ ఆలోచన
- గొడుగుల వల్ల కనీసం మీటర్ భౌతిక దూరం
- ఈ విధానం బాగుందన్న మంత్రి థామస్ ఇసాక్
కరోనాను నివారించేందుకు ప్రజలంతా తప్పనిసరిగా భౌతిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వాలు చేస్తున్న విజ్ఞప్తులను ప్రజలు పక్కన పెడుతున్న వేళ, కేరళలోని ఓ గ్రామ పంచాయతీ వినూత్న ఆలోచన చేసింది. బయటకు వచ్చేవారు ఎవరైనా నోటికి మాస్క్ తో పాటు, గొడుగు కూడా తప్పనిసరిగా చేతబట్టే రావాలని ఆదేశించింది.
నిత్యావసరాల కొనుగోలు లేదా మరే ఇతర అవసరాల నిమిత్తం బయటకు వచ్చినా, గొడుగు కూడా వెంట ఉండాల్సిందేనని రాష్ట్రంలోని అలపుళ సమీపంలోని తన్నీర్ ముక్కోమ్ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. వ్యక్తుల మధ్య గొడుగు ఉంటే, కనీసం మూడు అడుగుల దూరమైనా ఉంటుందని భావించిన పంచాయతీ అధికారులు, ఈ మేరకు ప్రజలకు ఆదేశాలు జారీ చేశారు.
అంతేకాదు, అప్పటికప్పుడు గొడుగులను కొనుగోలు చేయలేని వారికి సగం ధరకే గొడుగులను కూడా పంపిణీ చేశారు. ఇక ఈ ఆలోచన ప్రజల మధ్య దూరాన్ని పెంచి సత్ఫలితాలను కూడా ఇస్తోందట. ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన రాష్ట్ర మంత్రి థామస్ ఇసాక్, భూతిక దూరాన్ని ప్రజలు పాటించేలా చేసేందుకు గొడుగుల ఆలోచన బాగుందని, తెరచివుంచిన గొడుగులు ఒకదాన్ని ఒకటి తగులకుండా ఉంటే, వ్యక్తుల మధ్య కనీసం మీటర్ దూరం తప్పనిసరిగా ఉంటుందని అన్నారు. గొడుగుల ఆలోచన చాలా బాగుందని నెటిజన్లు కూడా కితాబునిస్తున్నారు.