OSCAR Awards: ఎప్పటి నుంచో ఉన్న కీలకమైన నిబంధనను మార్చుకున్న 'ఆస్కార్' అవార్డ్స్!

Oscars Suspend Movie Theatre Rule For A Year

  • లాస్ ఏంజెలెస్ థియేటర్లలో వారం రోజులు ఆడితేనే ఆస్కార్ కు ఎలిజిబిలిటీ
  • కరోనా కారణంగా రిలీజ్ కాని పలు సినిమాలు
  • ఈ ఏడాదికి నిబంధనను సడలించిన అకాడెమీ అవార్డ్స్

ప్రపంచంలోని అన్ని రంగాలపై కరోనా వైరస్ పంజా విసిరింది. ఈ మహమ్మారి దెబ్బకు అన్ని రంగాలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. సినీ రంగంలో అత్యున్నతమైన ఆస్కార్ అవార్డులపై కూడా కరోనా ప్రభావం చూపింది. కరోనా దెబ్బకు ఈ అవార్డులను ప్రకటించే అకాడెమీ... ఎప్పటి నుంచో ఉన్న అత్యంత కీలకమైన 'మూవీ థియేటర్' నిబంధనను మార్చుకోవాల్సి వచ్చింది.

వివరాల్లోకి వెళితే, ఆస్కార్ అవార్డులకు పోటీ పడాలనుకునే చిత్రం లాస్ ఏంజెలెస్ థియేటర్లలో కనీసం వారం రోజుల పాటు ఆడాలి. అప్పుడే హాలీవుడ్ బిగ్గెస్ట్ ప్రైజ్ కు పోటీ పడడానికి సదరు చిత్రం అర్హత సాధిస్తుంది. కరోనా నేపథ్యంలో, మార్చి మధ్య నుంచి సినిమాల ప్రదర్శనలు ఆగిపోయాయి. థియేటర్లలో మళ్లీ ఎప్పుడు సినిమాల ప్రదర్శన పునఃప్రారంభమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పలు చిత్రాలు ఈ ఏడాది ఆస్కార్ కు పోటీ పడలేని స్థితిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్ కీలక ప్రకటన చేసింది.

లాస్ ఏంజెలెస్ థియేటర్లలో విడుదల కాని చిత్రాలు కూడా ఈ ఏడాది ఆస్కార్ అవార్డులకు ఎలిజిబుల్ అవుతాయని తెలిపింది. థియేటర్ లో రిలీజ్ కానప్పటికీ... కమర్షియల్ గా ఇతర మాధ్యమాల్లో (ఆన్ లైన్) ప్రసారమయినా అర్హత సాధించినట్టేనని ప్రకటించింది. లాస్ ఏంజెలెస్ వెలుపల ఎక్కడ రిలీజైనా ఎలిజిబుల్ అవుతాయని తెలిపింది. అయితే, ఈ నిబంధన ఈ ఏడాదికి మాత్రమే పరిమితమని పేర్కొంది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చి, లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత... పాత నిబంధనే మళ్లీ అమలవుతుందని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News