Corona Virus: నెల్లూరులో కరోనా రోగులకు సేవలందించేందుకు రంగంలోకి దిగిన రోబోలు
- రోగుల నుంచి డాక్టర్లు, సిబ్బందికి సోకుతున్న వైరస్
- రోబోలను రంగంలోకి దించిన ప్రభుత్వం
- ఒకేసారి 40 కేజీల ఆహారం, మందులను సరఫరా చేయగల రోబోలు
కరోనా వైరస్ కేసులు ఏపీలో పెరుగుతున్నాయి. రోగులకు చికిత్స అందిస్తున్న సమయంలో లేదా మందులు, ఆహారాన్ని ఇస్తున్న సమయంలో డాక్టర్లు, వైద్య సిబ్బందికి కూడా వైరస్ సోకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు ఆహారం, మందులు అందించేందుకు రోబోలను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు రోబోలను అధికారులు రంగంలోకి దించారు.
తొలుత ఈ రోబోలను నెల్లూరు జిల్లాలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటికే ఓ రోబో సేవలను అందిస్తోంది. తాజాగా దీనికి మరో రెండు రోబోలు జతచేరనున్నాయి. 40 కేజీల ఆహారం, మందులను ఒకేసారి సరఫరా చేయగలిగిన శక్తి ఈ రోబోల సొంతం కావడం గమనార్హం.
మరోవైపు ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో, మొత్తం కేసుల సంఖ్య 1,332కి పెరిగింది. మొత్తం 31 మంది ప్రాణాలు కోల్పోయారు.