Corona Virus: ఆక్స్ ఫర్డ్ విజయం సాధిస్తే... డిసెంబర్ నాటికి 6 కోట్ల కరోనా వాక్సిన్ డోస్ లు రెడీ!
- యూకేలో కొనసాగుతున్న హ్యూమన్ ట్రయల్స్
- సెప్టెంబర్ నాటికి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
- ఆ వెంటనే భారీ ఎత్తున ఉత్పత్తికి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాట్లు
ప్రస్తుతం యూకేలోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కరోనా వాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ విజయవంతమైతే, డిసెంబర్ నాటికి ఇండియాలో 6 కోట్ల డోస్ లను సిద్ధం చేయగలమని పుణె కేంద్రంగా పనిచేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది.
'సీహెచ్ఏడీఓ ఎక్స్ వన్ ఎన్ కోవిడ్-19' పేరిట తయారైన వాక్సిన్ పనితీరుపై ప్రస్తుతం మానవుల్లో ప్రయోగాలు సాగుతున్నాయని తెలిపిన సీరమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అధర్ పూనావాలా, వాక్సిన్ విజయవంతమైతే, వెంటనే తయారీ ప్రారంభమవుతుందని తెలిపారు. వాక్సిన్ ను అభివృద్ధి చేయడంలో అత్యున్నత స్థాయి నిపుణులు కృషి చేస్తున్నారని, సెప్టెంబర్ నాటికి వారి పరిశోధనలు పూర్తవుతాయని, వాక్సిన్ సత్ఫలితాలను ఇస్తుందనే నమ్ముతున్నట్టు ఆయన ప్రకటించారు.
కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వాక్సిన్ కోసం వెయ్యికి పైగా పరిశోధనలు సాగుతుండగా, ఐదు వాక్సిన్ లు తొలి దశ క్లినికల్ ట్రయల్స్ కు చేరుకున్నాయన్న సంగతి తెలిసిందే. ఇక ఒక్కో వాక్సిన్ డౌస్ ధర రూ. 1000 వరకూ ఉండే అవకాశం ఉందని తెలుస్తుండగా, ప్రస్తుతానికి మాత్రం ప్రజలకు ఉచితంగానే కేంద్రం సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయి. వాక్సిన్ తయారీ యూనిట్ కోసం రూ. 600 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ఇటీవలే సీరమ్ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.