Suma: 'నా పిలుపుకి స్పందించారు.. ఇది కన్నీరు కాదు.. ఆనంద బాష్పాలు' అంటున్న యాంకర్ సుమ.. వీడియో ఇదిగో
- అక్షయ పాత్ర తరఫున విరాళాలు సేకరిస్తోన్న సుమ
- మొత్తం రూ.5 లక్షల విరాళాల సేకరణ లక్ష్యం
- ఇప్పటివరకు రూ.3,91,000 సేకరణ
- మానవత్వాన్ని నిరూపించుకుంటున్నారన్న సుమ
కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్డౌన్ విధించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి ఆహారం అందించడానికి అక్షయ పాత్ర తరఫున యాంకర్ సుమ విరాళాలు సేకరిస్తోంది. మొత్తం రూ.5 లక్షల విరాళాలు సేకరించడం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు రూ.3,91,000 వచ్చాయి.
మొత్తం 307 మంది ఈ విరాళాలు ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో తాను ఇచ్చిన పిలుపుపట్ల ఇంతమంది స్పందించి విరాళాలు ఇచ్చినందుకుగానూ సుమ కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు ఫేస్బుక్ లైవ్లో ఆమె అభిమానులతో మాట్లాడి విరాళాలు ఇవ్వాలని కోరింది.
విరాళాల కోసం తాను ఇచ్చిన పిలుపునకు అభిమానులు బాగా స్పందించారంటూ కన్నీరు పెట్టుకుంది. ఇది కన్నీరు కాదని ఆనంద బాష్పాలని ఆమె కళ్లు తుడుచుకుంటూ వ్యాఖ్యానించింది. విపత్కర సమయంలో తాము మాత్రమే బాగుండాలని అనుకోకుండా ఇతరుల ఆకలిని తీర్చుతున్నారని ప్రశంసించింది. మానవత్వం ఇంకా బతికే ఉందని చాలా మంది నిరూపిస్తున్నారని తెలిపింది. ఇంత మంది స్పందిస్తుండడం తన హృదయాన్ని కదలిస్తోందని ఆమె భావోద్వేగభరితంగా మాట్లాడింది.