Indian villages: గ్రామాల్లోనూ ఆన్‌లైన్ ఆర్డర్ల స్వీకరణ.. హోమ్ డెలివరీలు!
- ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ- కామర్స్ సంస్థల ద్వారా సరుకుల చేరవేత
- గ్రామ స్థాయి ఆన్‌లైన్ రిటైల్ చైన్‌ను ఏర్పాటు చేసిన కేంద్రం
- 3.8 లక్షల ఔట్‌లెట్ల ద్వారా 60 కోట్ల మందికి సేవలు లక్ష్యం
- ఇప్పటికే 2 వేల సెంటర్ల ఏర్పాటు
నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న ప్రజలు.. పలు ఈ కామర్స్ సంస్థల ద్వారా నిత్యావసర సరుకులు నేరుగా ఇంటికే తెప్పించుకుంటున్నారు. కానీ, లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు సరుకుల రవాణా కష్టమవుతోంది.
అందువల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ- కామర్స్ రిటైల్ సేవలను కేంద్రం ప్రారంభించింది. ఈ సేవలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆర్డర్లను సేకరించి సరుకులను నేరుగా గ్రామాల్లోని వినియోగదారుల ఇంటికే చేరవేస్తోంది. ఇందుకోసం గ్రామ స్థాయి ఆన్‌లైన్ రిటైల్ చైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రణాళికను కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్‌సీ) ద్వారా అమలు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 3.8 లక్షల ఔట్‌లెట్ల ద్వారా 60 కోట్ల మందికి సేవలు ఈ సేవలు చేరేలా ప్లాన్ చేశారు.
ఈ ఔట్‌లెట్లు ప్రైవేటు వ్యక్తులు ఏర్పాటు చేసినప్పటికీ అవి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మార్గనిర్దేశంలో నడుస్తాయి. నిత్యావసర సరుకులైన కూరగాయలు, పాలు, పప్పు దినుసులు, పండ్లు, ఇతర వస్తువుల అమ్మకం, వినియోగదారులకు చేరవేత సీఎస్‌సీలు చేసే పని.
సంబంధిత యాప్ ద్వారా వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి సీఎస్‌సీల ద్వారా సరుకులు నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. ఒక్కో సీఎస్‌సీ సెంటర్ 5 నుంచి 10 కిలోమీటర్ల పరిధి వరకు సేవలు అందిస్తాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటికే 2000 సెంటర్లను ఏర్పాటు చేసినట్టు సీఎస్‌సీ సీఈవో దినేశ్ త్యాగి వెల్లడించారు. మే నెలాఖరు వరకు పది వేల సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాదిలో దాదాపు లక్ష సెంటర్ల ఏర్పాటు తమ లక్ష్యమని అన్నారు.