Irrfan Khan: ఇర్ఫాన్ మరణం ప్రపంచ సినిమాకు, నాటక రంగానికి తీరని లోటు: మోదీ
- క్యాన్సర్ తో మృతి చెందిన ఇర్ఫాన్ ఖాన్
- ఇర్ఫాన్ ఎప్పటికీ గుర్తుండిపోతారన్న మోదీ
- దేశం గొప్ప నటుడిని కోల్పోయిందన్న అమిత్ షా
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ షాక్ కు గురైంది. ఇర్ఫాన్ మరణం పట్ల భారత ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ మరణం ప్రపంచ సినిమాకు, నాటక రంగానికి తీరని లోటు అని అన్నారు. నటనా రంగంలో అసమాన ప్రతిభను కనపరిచిన ఇర్ఫాన్ ఎప్పటికీ గుర్తుండిపోతారని చెప్పారు. ఇర్ఫాన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు.
మరోవైపు ఇర్ఫాన్ మృతిపై అమిత్ షా స్పందిస్తూ... మరణవార్త తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. అసమాన నటనతో ప్రపంచ స్థాయిలో ఇర్ఫాన్ పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకున్నారని కొనియాడారు. ఆయన మరణంతో దేశం ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
53 ఏళ్ల ఇర్ఫాన్ ఖాన్ ఈరోజు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. లండన్ లో చికిత్స చేయించుకున్న ఇర్ఫాన్ ఇటీవలే ఇండియాకు వచ్చారు. 'ఆంగ్రేజీ మీడియం' అనే సినిమాలో చివరిసారిగా నటించారు. ఇర్ఫాన్ మరణంతో బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.