Nitin Gadkari: లాభం ఆశించొద్దు.. ఫ్లాట్లను వాస్తవ ధరకు విక్రయించండి: బిల్డర్లకు నితిన్ గడ్కరీ సలహా
- నారెడ్కో ఆధ్వర్యంలో వెబ్‌నార్
- నగదు లభ్యత పెంచుకునే మార్గాలను సూచించిన మంత్రి
- సొంత ఫైనాన్స్ సంస్థలు ఏర్పాటు చేసుకోవాలని సూచన
ప్రస్తుతం దేశం మొత్తం కరోనా సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో ఇళ్లు, ఫ్లాట్ల విక్రయాల్లో లాభాలు ఆశించవద్దని, వాస్తవ ధరకే వాటిని విక్రయించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బిల్డర్లను కోరారు. స్థిరాస్తి సమాఖ్య నారెడ్కో ఆధ్వర్యంలో నిర్వహించిన వెబ్‌నార్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నగదు లభ్యత పెంచుకోవడం కోసం, రుణాలపై చెల్లించాల్సిన వడ్డీని ఆదా చేసుకునేందుకు ఇలా చేయడం ఉత్తమమని అన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడానికి అవసరమైన సలహాలు, సూచనలను ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నారెడ్కోను కోరారు.
గ్రామీణ ప్రాంతాలకు వ్యాపారాల్ని విస్తరించుకోవడంతోపాటు రహదారుల నిర్మాణం వంటివి చేపట్టడం ద్వారా గృహాలకు గిరాకీ పెంచుకోవచ్చని సూచించారు. వాహన పరిశ్రమలను ఉదాహరణగా తీసుకుని సొంత ఫైనాన్స్ కంపెనీలు స్థాపించాలన్నారు. దీర్ఘకాలిక రుణాలను తక్కువ వడ్డీ రేటుకు అందిస్తే ఈఎంఐ తక్కువగా ఉంటుందని, తద్వారా ఖాతాదారులకు ప్రయోజనంగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
ముంబైలోని చాలామంది నిర్మాణదారులు ఇళ్లను అమ్ముకోకుండా చదరపు అడుగుకు రూ.40 వేల వరకు వస్తుందని ఎదురుచూస్తున్నారని, ఇది మరీ అత్యాశే అవుతుందన్నారు. కాగా, అప్పట్లో పెద్ద నోట్ల రద్దుతో కుదేలైన స్థిరాస్తి రంగాన్ని ఇప్పుడు కరోనా వైరస్ సంక్షోభంలోకి నెట్టేసిందని, కాబట్టి ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించాలని నారెడ్కో జాతీయ అధ్యక్షుడు నిరంజన్ హీరానందానీ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.