India: విజయ్ మాల్యా, మేహుల్ చౌక్సి తదితరుల... రూ. 68,607 కోట్ల రుణాలను రద్దు చేసిన ఆర్బీఐ!
- 50 మంది విల్ ఫుల్ డిఫాల్టర్ల జాబితా విడుదల
- మాల్యా, నీరవ్, చౌక్సీ కంపెనీల రుణాలు రద్దు
- సెప్టెంబర్ 30, 2019 వరకూ రద్దయిన రుణాల వివరాలు వెల్లడించిన ఆర్బీఐ
- అందరూ బీజేపీ మిత్రులేనని మండిపడిన రాహుల్ గాంధీ
ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ముద్రపడి, దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా, మేహుల్ చౌక్సీలు సహా, 50 మంది టాప్ డిఫాల్టర్లకు చెందిన రూ. 68,607 కోట్ల విలువైన మొండి బకాయిలను రైటాఫ్ (సాంకేతిక రద్దు) చేసినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
సమాచార హక్కు చట్టం కార్యకర్త సాకేత్ గోఖలే, అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ సమాధానం ఇస్తూ, 2009, సెప్టెంబర్ నాటికి ఈ మొత్తాన్ని బ్యాంకులు రద్దు చేశాయని పేర్కొంది. ఇండియాలో ముందువరసలో వున్న ఉద్దేశపూర్వక ఎగవేతదారులు, వారు తీసుకున్న రుణాల పరిస్థితిని తనకు తెలియజేయాలని గోఖలే ఫిబ్రవరి 16న దరఖాస్తు చేసుకోగా, ఆర్బీఐ ఏప్రిల్ 24న సమాధానం ఇచ్చింది.
ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో సాకేత్ గోఖలే వెల్లడిస్తూ, గతంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టాప్-50 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల జాబితాను బహిర్గతం చేయాలని లోక్ సభలో డిమాండ్ చేయగా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వివరాల వెల్లడికి నిరాకరించారని గుర్తు చేసిన ఆయన, తాను ఆర్టీఐ చట్టం కింద సమాధానం కోసం దరఖాస్తు చేశానని తెలియజేశారు. దీంతోనే ఈ జాబితా విడుదలైందని అన్నారు.
ఇక రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన వివరాల ప్రకారం, విల్ ఫుల్ డిఫాల్టర్స్ జాబితాలో విదేశాలకు చెక్కేసిన గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ యజమాని మెహుల్ చోక్సీ తొలి స్థానంలో నిలిచారు. ఆయన చెల్లించాల్సిన రూ. 5,492 కోట్లు రద్దయ్యాయి. ఆయనకే చెందిన గిలి ఇండియా, నక్షత్ర బ్లాండ్స్ రుణాలు కూడా రైటాఫ్ అయ్యాయి. ఆ తరువాత రెండు, మూడు స్థానాల్లో ఎఫ్ఎంసీజీ సంస్థ ఆర్ఈఐ ఆగ్రో లిమిటెడ్ (రూ. 4,314 కోట్లు), జతిన్ మెహతా విన్ సమ్ డైమండ్స్ అండ్ జ్యూయెలరీ లిమిటెడ్ (రూ. 4,076 కోట్లు) ఉన్నాయి. ప్రస్తుతం లండన్ లో ఉంటున్న యూబీ గ్రూప్ సంస్థల మాజీ చైర్మన్ విజయ్ మాల్యా కంపెనీలకు సంబంధించి రూ.1,943 కోట్ల రుణాలు కూడా రద్దయ్యాయి.
ఆర్బీఐ విడుదల చేసిన ఈ జాబితాలోని ఇతర ఎగవేతదారులను పరిశీలిస్తే, రోటోమాక్ గ్లోబల్ ప్రయివేటు లిమిటెడ్ రూ.2,850 కోట్లు, కుడోస్ కెమి లిమిటెడ్ కు చెందిన రూ.2,326 కోట్లు, జూమ్ డెవలపర్స్ ప్రయివేట్ లిమిటెడ్ రూ.2,012 కోట్లు, బాబా రామ్ దేవ్, బాలకృష్ణలకు చెందిన రుచి సోయా బ్యాంకులకు కట్టాల్సిన రూ. 2212 కోట్లు రద్దయ్యాయి. ఫరెవర్ ప్రీషియస్ జ్యూయెలరీ అండ్ డైమండ్స్ ప్రయివేటు లిమిటెడ్ చెల్లించాల్సిన రూ. 1,962 కోట్లు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ నుంచి రావాల్సిన రూ.1,915 కోట్లు కూడా రద్దయ్యాయి.
ఇక గోఖలే కోరినట్టుగా ఫిబ్రవరి 16 వరకూ ఉన్న పన్ను ఎగవేతదారుల జాబితా సమాచారం తమ వద్ద అందుబాటులో లేదని, టెక్నికల్ గా సెప్టెంబర్ 30, 2018 నాటికి రద్దు అయిన ఎగవేతదారుల సమాచారాన్ని అందిస్తున్నామని ఆర్బీఐ వివరణ ఇచ్చింది.
ఇక ఆర్బీఐ ఇచ్చిన ఈ సమాచారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, రుణ ఎగవేతదారులు, బీజేపీ స్నేహితులేనని, అందుకే ఈ సమాచారాన్ని పార్లమెంట్ లో వెల్లడించలేదని ఆరోపించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మేహుల్ చౌక్సీ వంటి వారి రుణాలను బీజేపీ మాఫీ చేసిందనడానికి ఆర్బీఐ ఇచ్చిన సమాధానమే రుజువని మండిపడ్డారు.ఆర్బీఐ ఇచ్చిన జాబితాలో బీజేపీ మిత్రులదే అగ్రభాగమని విమర్శలు గుప్పించారు.
ఇదే సమయంలో వీరి రుణాలను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. మోసగించిన వారిని, పారిపోయిన వారిని మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.