India: మే 4 తరువాత ఎన్నో ప్రాంతాలకు లాక్ డౌన్ నిబంధనల నుంచి వెసులుబాటు: కేంద్ర హోమ్ శాఖ
- లాక్ డౌన్ తో సత్ఫలితాలు
- 4 నుంచి నిబంధనల సడలింపు
- సమీక్ష తరువాత హోమ్ శాఖ ప్రకటన
ఇండియాలో కరోనా కట్టడికి తీసుకు వచ్చిన లాక్ డౌన్ నిబంధనల నుంచి మే 4 తరువాత చాలా జిల్లాల్లో చెప్పుకోతగ్గ సడలింపులు ఉంటాయని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన నూతన విధానం, నియమ నిబంధనలు అతి త్వరలోనే విడుదల అవుతాయని హోమ్ శాఖ తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.
"లాక్ డౌన్ పై సమగ్ర సమీక్ష జరిపిన తరువాత, పరిస్థితిలో చాలా మార్పు వచ్చిందని, లాక్ డౌన్ సత్ఫలితాలను ఇచ్చిందని గుర్తించాము. ఈ ఫలితాలను పోగొట్టుకోకుండానే, భవిష్యత్తులో ముందుకు సాగాలి. మే 3 వరకూ ప్రస్తుత నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందే" అని ట్వీట్ చేశారు.
ఆపై "కొవిడ్-19పై పోరులో కొత్త గైడ్ లైన్స్ మే 4 నుంచి అమలులోకి వస్తాయి. ఇందులో భాగంగా కరోనా జాడలేని చాలా జిల్లాలలో వెసులుబాటు ఉంటుంది. త్వరలోనే ఈ వివరాలను వెల్లడిస్తాం" అని కూడా పేర్కొన్నారు.