Remdesivir: కరోనాపై మెరుగ్గా పనిచేస్తున్న 'రెమడీసివిర్': యూఎస్

Remdesivir Positive Effect on Corona

  • 'రెమడీసివిర్'  పనితీరుపై ఆధారాలు లభించాయి
  • 30 శాతం వేగంగా రోగుల రికవరీ
  • యూఎస్ ఎపిడమాలజిస్ట్ ఆంధోనీ ఫౌసీ

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.26 లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా వైరస్ పై పోరులో 'రెమడీసివిర్' ఔషధం మెరుగ్గా పనిచేస్తోందనడానికి రుజువులు లభించాయని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ఔషధాన్ని వాడిన వారు 30 శాతం వేగంగా రికవర్ అవుతున్నారని స్పష్టం చేశారు. 'రెమడీసివిర్' యాంటీ వైరల్ డ్రగ్ అద్భుతంగా పనిచేస్తున్నదని, దీంతో ఎన్నో ఆశలు కలుగుతున్నాయని తెలిపారు.

బుధవారం నాడు మీడియా సమావేశాన్ని నిర్వహించిన యూఎస్ ఎపిడమాలజిస్ట్ ఆంధోనీ ఫౌసీ ఈ విషయాన్ని వెల్లడించగా, వాల్ స్ట్రీట్ లో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెరిగి, సూచీలు లాభాల్లో పయనించాయి. గడచిన దశాబ్దకాలంలోనే ఎన్నడూ లేనంతగా ఆర్థిక వ్యవస్థ పతనమైన వేళ, రెండో ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పడినటువంటి మాంద్యం రానుందని జర్మనీ అంచనా వేస్తున్న వేళ, కరోనా కేసులను తగ్గించేందుకు 'రెమడీసివిర్' ఎంతో సహకరిస్తోందని ఫౌసీ తెలిపారు.

రికవరీలో స్పష్టమైన పాజిటివ్ ఎఫెక్ట్ ను 'రెమడీసివిర్' చూపిస్తోందని పేర్కొన్న ఫౌసీ, 1980లో హెచ్ఐవీ కనిపించిన తొలిదశలో అల్ బెయిట్ ఔషధం చూపించిన ప్రభావాన్నే ఇప్పుడు కరోనాపై 'రెమడీసివిర్' చూపుతోందని వ్యాఖ్యానించారు. ఈ డ్రగ్ వైరస్ ను బ్లాక్ చేస్తుందని యూఎస్, యూరప్, ఆసియాలోని 68 ప్రాంతాల్లో 1,063 మందిపై జరిపిన పరీక్షల్లో నిరూపితమైందని అన్నారు.

కాగా, ఇదే డ్రగ్ ను ఎబోలా రోగులపై ప్రయోగించినప్పుడు విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా కరోనా విషయంలోనూ ఇది ఫెయిల్ అయిందని గతవారంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. దీన్ని చైనాలోని వూహాన్ లో ప్రయోగించగా, పరిమిత ప్రభావమే కనిపించిందని వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా, అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించిన ఈ విషయాన్ని బలపరిచేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అధికారి మైఖేల్ ర్యాన్ నిరాకరించారు. పూర్తి అధ్యయనాన్ని తానింకా చూడలేదని, అయితే, ప్రతి ఒక్కరూ కరోనాపై ప్రభావవంతంగా పనిచేసే డ్రగ్ కోసం వేచి చూస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News