Jogulamba Gadwal District: విపరీతంగా దగ్గుతున్న శునకాలు.. కరోనా అనుమానంతో హడలిపోయిన జనం!
- జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన
- కరోనా లక్షణాలు లేవన్న వెటర్నరీ వైద్యులు
- శునకాలకు యాంటీబయాటిక్స్
గొంతు వద్ద వాపు వచ్చిన శునకాలు విపరీతంగా దగ్గుతుండడంతో జనం బెంబేలెత్తిపోయారు. ఇప్పటికే కరోనా భయంతో అల్లాడిపోతున్న ప్రజలను కుక్కల దగ్గు మరింత భయాందోళనలోకి నెట్టింది. వాటికి కూడా కరోనా సోకిందేమోనన్న అనుమానంతో వెంటనే వెటర్నరీ అధికారులకు సమాచారం అందించారు. వారొచ్చి పరీక్షలు చేయగా శునకాలకు కరోనా సోకలేదని నిర్ధారణ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పెద్దపోతులపాడులో జరిగిందీ ఘటన. గ్రామ సమీపంలోని పౌల్ట్రీ ఫాం వద్ద పారేసిన కోళ్ల వ్యర్థాలను తినడం వల్లే కుక్కలు అలా ప్రవర్తిస్తున్నాయని, వాటిలో కరోనా లక్షణాలు లేవని జిల్లా వెటర్నరీ అధికారి ఆదిత్య కేశవసాయి తెలిపారు. బాధిత శునకాలకు యాంటీబయాటిక్స్ మందులు ఇచ్చినట్టు పేర్కొన్నారు.