Warangal Rural District: పెళ్లి కోసం మహారాష్ట్రకు.. నెలరోజులుగా 50 మంది తెలంగాణ వాసుల పడిగాపులు
- కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి భివండికి
- తిరుగు ప్రయాణానికి అడ్డొచ్చిన జనతా కర్ఫ్యూ
- వండి వడ్డించలేక పెళ్లింటి వారి అవస్థలు
తెలంగాణలోని కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 50 మంది మహారాష్ట్రలో చిక్కుకుపోయి సాయం కోసం వేడుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా స్వగ్రామాలకు వచ్చే వీలు లేక నెల రోజులుగా అక్కడే చిక్కుకుపోయారు. మహారాష్ట్రలోని భివండిలో బంధువుల ఇంట్లో జరగనున్న వివాహానికి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ నుంచి 30 మంది, వరంగల్ జిల్లా వేలేరుకు చెందిన 20 మంది వెళ్లారు. పెళ్లి అనంతరం అదే నెల 22న తిరిగి వచ్చేందుకు రైలు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు.
అయితే, అకస్మాత్తుగా వచ్చిన జనతా కర్ఫ్యూ, ఆ వెంటనే లాక్డౌన్ కారణంగా వీరంతా అక్కడే చిక్కుకుపోయారు. ప్రస్తుతం వీరంతా విడిది ఇళ్లలోనే ఉన్నారు. నిత్యం 50 మంది బాగోగులు చూడలేక పెళ్లింటి వారు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు, అక్కడ చిక్కుకుపోయిన తమ వారు ఎలా ఉన్నారో తెలియక ఇక్కడ వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అధికారులను చేతులెత్తి వేడుకుంటున్నారు.