Rishi Kapoor: నాన్న చివరి చూపుల కోసం.. రోడ్డు మార్గంలో 1400 కి.మీ. ప్రయాణిస్తున్న రిషికపూర్ తనయ!
- భర్తతో కలసి ఢిల్లీలో ఉంటున్న రిషికపూర్ తనయ
- వాయుమార్గంలో ఢిల్లీ నుంచి ముంబై వెళ్లేందుకు ప్రయత్నం
- రోడ్డు మార్గంలో పయనించేందుకు అనుమతి
బాలీవుడ్ దిగ్గజం రిషికపూర్ మరణవార్తతో ఆయన కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన గారాలపట్టి, ఏకైక కుమార్తె రిద్ధిమా కపూర్ (39) ఢిల్లీలో ఉంటున్నారు. ఆమె భర్త ఓ పారిశ్రామికవేత్త. దీంతో, ఆమె తన తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రోడ్డు మార్గంలో ఢిల్లీ నుంచి ముంబైకి బయల్దేరారు. ఆమె ప్రయాణానికి అధికారులు అనుమతించారు.
తన తండ్రి ఆసుపత్రిలో చేరారన్న వార్త అందిన వెంటనే రిద్ధిమా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ముంబై బయల్దేరేందుకు సిద్ధమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, చార్టర్డ్ ఫ్లైట్ లో ముంబై వెళ్లేందుకు అనుమతి కోసం నిన్న రాత్రే కేంద్ర హోం మంత్రిత్వ శాఖను వీరు సంప్రదించారు. అయితే లాక్ డౌన్ నిబంధనల కారణంగా వాయుమార్గంలో ప్రయాణించేందుకు అనుమతిని కేవలం హోం మంత్రి అమిత్ షా మాత్రమే ఇవ్వగలరని అధికారులు చెప్పడంతో, ఆ ప్రయత్నాన్ని విరమించుకుని రోడ్డు మార్గంలో ప్రయాణించేందుకు అనుమతి తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ, రోడ్డు మార్గంలో ముంబై వెళ్లేందుకు నిన్న రాత్రి పొద్దుపోయాక వారు అనుమతిని కోరారని చెప్పారు. నిమిషాల వ్యవధిలోనే పర్మిషన్ ఇచ్చామని... ఇలాంటి పరిస్థితుల్లో అనుమతి ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసు శాఖ ఏమాత్రం ఆలస్యం చేయదని తెలిపారు. ఈ నేపథ్యంలో భర్త, కుటుంబసభ్యులతో కలిసి రిద్ధిమా కపూర్ రోడ్డు మార్గంలో పయనిస్తున్నారు. ఢిల్లీ, ముంబై మధ్య ఉన్న దూరం 1,400 కిలోమీటర్లు.